Shravana Masa Mahatmyam Day – 18 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 18

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాందపురాణం(Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుద్ధ దశమి (Dashami) నాడు ప్రారంభించి ప్రతి నెలా శుక్ల దశమి నాడు చేయవలసిన “ఆశాదశమీ వ్రతం” గురించి వివరిస్తాడు. ఈ వ్రతాన్ని రాజ్యాపేక్షతో క్షత్రియులు (Kshatriya) , వ్యాపార నిమిత్తం వైశ్యులు, సంతానం కోసం గర్భిణీ స్త్రీలు, మంచి భర్త కోసం కన్యలు వంటి వివిధ కోరికలు గలవారు ఆచరించవచ్చు. ఈ వ్రతంలో శ్రావణ శుద్ధ దశమి నాడు రాత్రి ఉపవాసం ఉండి, వాకిలి ముందు బియ్యపు పిండి, బుక్కాయిలతో దశదిక్పాలకుల ప్రతిమలను గీసి, వాటిని శస్త్రాలు, వాహనాలతో సహా పూజించాలి. వారికి నెయ్యితో కూడిన అన్నం, ఫలాలు నివేదన చేయాలని, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, ఆశీర్వాదం తీసుకోవాలని చెబుతాడు. ఈ వ్రతం చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, గ్రహ పీడలు తొలగిపోతాయని శివుడు తెలియజేస్తాడు.

వ్రతాన్ని సంవత్సరం పాటు ప్రతి నెలా ఆచరించి, సంవత్సరాంతంలో ఉద్యాపన (Udyapana) చేయాలని ఈశ్వరుడు సూచిస్తాడు. ఉద్యాపన సమయంలో దశదిక్పాలకుల ప్రతిమలను బంగారంతో లేదా వెండితో చేయించి, వాటిని పూజించి దానం ఇవ్వాలి. జాగరణ చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఈ వ్రతం స్త్రీలు తప్పక ఆచరించాలని, దీని ద్వారా వారికి సుభాగ్యం లభిస్తుందని నొక్కి చెబుతాడు. ఈ దశమీ వ్రతం ఐశ్వర్యం, కీర్తి, ఆయుస్సును ప్రసాదిస్తుందని, దీనికి మించిన వ్రతం మూడు లోకాలలో మరొకటి లేదని శివుడు ఉద్ఘాటిస్తాడు. ఈ వ్రతం మోక్షాన్ని కూడా సులభంగా ప్రసాదిస్తుందని తెలియజేస్తూ, ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.

🍃🌷అష్టాదశాధ్యాయము – ఆశాదశమీ వ్రత కథనం:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻సనత్కుమార ఉవాచ:

పార్వతీదేవికి పెనిమిటియు, భక్తులను అనగ్రహించువాడవు, దయా సముద్రుడవు అగు ఓ భగవంతుడా! దశమి తిధి యొక్క మహిమను చెప్పవలయునని సనత్కుమారుడు సాంబమూర్తిని అనడిగెను.

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు…

ఓ మునీశ్వరా! ఈ దశమీ వ్రతము శ్రావణ శుద్ధ దశమి యందు ప్రారంభించి పండ్రెండు మాసములలోను ప్రతి శుక్ల దశమి యందును చేయుచు, తిరిగి శ్రావణము రాగానే శుక్ల దశమి యందు శ్రేష్ఠంబగు ఈ వ్రతమునకు ఉద్యాపనము చేయవలెను.

క్షత్రియుడు రాజ్యాపేక్ష చేతను, వ్యవసాయదారుడు వ్యవసాయము నిమిత్తము, వైశ్యుడు వర్తకనిమిత్తం, గర్భిణీ స్త్రీ పుత్రుల నిమిత్తం, సర్వజనులు ధర్మార్ధకామముల కొరకును, పెండ్లి కాని చిన్నది మంచి వరుడు సంభవించుట కొరకును, బ్రాహ్మణుడు యజ్ఞము చేయుట కొరకును, రోగవంతుడు ఆరోగ్యము కొరకును, పెనిమిటి దూర దేశము వెళ్లి బహుకాలము వరకు రాకుండిన ఎడల శీఘ్రముగా వచ్చు నిమిత్తం వాని భార్యయు, ఈ ప్రకారం ఎవరెవరు ఎట్టి కోరిక గలవారైయుందురో వారి వారి కోరికల సఫలము కొరకు ఈ దశమీ వ్రతమును సమస్తమైన వారును ముఖ్యంగా చేయవలయును.

ఎవనికి ఎట్టి పీడ కలుగునో, అట్టి పీడలు తొలగుట కొరకు చేయవలయును, శ్రావణ శుక్ల దశమి యందు స్నానము చేసి, పరిశుద్ధుడై, శుభ్ర వస్త్రములను ధరించి ఆయా దిక్కుల అధి దేవతలకు పూజ చేయునిమిత్తం, రాత్రి వరకు ఉపవాసము చేసి, వాకిలి ముందు బియ్యపు పిండి, బుక్కాయి మొదలగు వానితో అష్ట దిక్కులకు అధిదేవతలను శస్త్రములు వాహనములు మొదలగు వానితో గూడికొని యున్నవారినిగా స్త్రీ విగ్రహములను లిఖియించి, వేరు వేరుగా దీపములను వెలిగించి, నేతితో మిశ్రితమగు అన్నము మొదలగు వానిని వేరు వేరుగా నివేదనం చేయవలెను.

ఆయా కాలముల యందు సంభవించిన ఫలములను నివేదన చేయవలెను. దిక్కులన్నియు శోభస్కరములుగా ఉండుగాక, నా యొక్క కోరికలు సఫలములగు గాక, ఓ దేవతలారా! మీ అనుగ్రహము వలన ఎల్లప్పుడు మాకు శుభము కలుగుచుండు గాక! అని ప్రార్ధించి, దిక్కులకు అధిదేవతలను యధావిధిగా పూజించి, బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణ, తాంబూలాదులను ఇయ్యవలయును. ఈ ప్రకారము సంవత్సరము వరకు ప్రతి మాసమునందును చేయుచు, ఓ మునీశ్వరా! పిమ్మట ఉద్యాపనమును యధావిధిగా చేయవలయును.

దిక్కుల యొక్క అధిదేవతల ప్రతిమలను బంగారముతోగాని, వెండితో గాని చేయించవలయును. శక్తిలేని పక్షమున బుక్కాయితోనైన వేయవలయును.

అనంతరము స్నానము చేసి, పరిశుద్ధుడై సర్వాభరణములచే అలంకరింపబడి, వాకిలి ముందర భాగమున దశ దేవతలను (Dasha Devata) ఆవాహనము చేసి, భక్తితో కూడిన మనస్సు గలవాడై, క్రమముగా దశ దేవతలను ముందు చెప్పబోయెడి మంత్రములచే ఆవానహము చేసి పూజింపవలయును.

ఓ తూర్పుదిక్కా! దేవతల చేతను, రాక్షసుల చేతను నమస్కరింప బడునట్టియు, మూడు లోకములకు ప్రభువగు దేవేంద్రుడు నీ దిక్కు నందు ఎల్లప్పుడు నివసించి యుండును. అట్టి తూర్పు దిక్కునకు (East) నమస్కారము.

ఓ ఆగ్నేయ (South East) దిక్కా! నీవు అగ్నిహోత్రునిచే పరిగ్రహరింప బడితివి కాబట్టి, ఆగ్నేయమని చెప్పబడితివి, అందువలన తేజోరూపిణివై, పరాశక్తివైతివి కాబట్టి, నేను కోరిన వరములనిత్తువు గాక.

ఓ దక్షిణ (South) దిక్కా! యమధర్మరాజు నీ దిక్కు యందుండి, లోకములను శిక్షించుచున్నాడు కాబట్టి, సంయమనీ అనే పేరుగల దానివైతివి, నా యొక్క కోరికలనిత్తువు గాక.

ఓ నైఋతి (South West) దిక్కా! హస్తము నందు ఖడ్గము కలవాడై పరాక్రమించుచు నైఋతియను రాక్షనునిచే అధిష్టింపబడితివి కాబట్టి, నీవు నైఋతియనీ చెప్పబడితివి. అటువంటి నీవు నా మనస్సుననుండు సమస్త కోరికలను సఫలము చేయుదువు గాక.

ఓ పశ్చిమ (West) దిక్కా! నీవు భువనములకు ఆధారమైన దానవు, జల జంతువులకు, అధిదేవతయగు వరుణ దేవుడు నీవదిక్కునందు ఉండెను, కాబట్టి, అట్టి నీవు నా యొక్క ధర్మము కొరకు, కార్యసిద్ధి కొరకు అనుకూలమైనదానవు అగుదువు గాక!

ఓ వాయవ్య (North West) దిక్కా! జగదాధారుడైన వాయువుచే అధిష్ఠింపబడితివి కావున, నీవు నిత్యము నా గృహము నందు నివసించి శుభములను ఒసగుగుచుండుము.

ఓ ఉత్తర (North) దిక్కా! నీవు కుబేరునిచే అధిష్ఠింపబడి ప్రసిద్ధి కెక్కితివి కావున, నీవు నా యొక్క కోరికల నొసగి, మమ్ములను మరియొక కోరిక లేని వాళ్లనుగా చేయవలయును.

ఈశాన్య (North East) దిక్కా! జగత్ప్రభువగు సాంబమూర్తిచే అధిష్ఠింపబడితివి, శుభముల నొనగునట్టి ఓ దేవీ ! నీకు నమస్కారము చేసెదను నాకు కోరికలను నొసగుము.

ఓ ఊర్ధ్వ దిక్కా! ఎల్లప్పుడు శుభములనొసగు దానవును, సనకాది మునీశ్వరులతో కూడి యుండు దానవునైతివి, ఎల్లప్పుడు నన్ను రక్షింపుచుండుము, నీ యందు నివసించు నటువంటి ఆశ్వని మొదలగు ఇరువది ఏడు నక్షత్రములును (Stars) సూర్యుడు మొదలగు నవగ్రహములును ఇతరములగు నక్షత్ర సంఘములును ఆ నక్షత్రములకు తల్లులును మరియు భూతములు, ప్రేత పిశాచములు, వినాయకులు మొదలగు జ్యోతిర్గణములనన్నియు భక్తితో గూడిన మనస్సుగలవాడనై పూజించుచుంటిని, కావున, అవియన్నియు ఎల్లప్పుడు, నా యొక్క ఇష్ట సిద్ధి కొరకు సన్నద్ధులై యండుగాక!

భూతలము మొదలు పాతాళము (Patalam) వరకు నుండు ఓ అధోదిశా! నీవు సర్ప కులముచే సేవింపబడుచుంటివి, నీవు సంతోషమైన మనస్సు గలదానవై సర్ప స్త్రీలతో కూడిన దానవగుచు నా యొక్క కోరికల నొసగుము.

ఈ ప్రకారము అర్ధమునిచ్చు మంత్రములచే పది దిక్కులను, పుష్పములును, ధూపం మొదలగువానిచే పూజించి, అనంతరం అలంకారములు వస్త్రములు ఫలములు మొదలగుదానిని ఆ దేవతలకు సమర్పించవలయును.

అనంతరము వాద్యములు మొదలగు వానియొక్క ధ్వనుల చేతను, సంగీతము, నాట్యము మొదలగు మంగళధ్వనుల చేతను, నాట్యము నందు నేర్పుగల మనోహరులగంబు వేశ్యల నాట్యము చేతను, ఆ రాత్రియంతయు జాగరణముచే గడపవలెను.

సంతోషయుక్తమైన మనస్సు గలవారలై, కుంకుమ అక్షతలు తాంబూలములు మొదలగువానిని ఇచ్చుట, మొదలగు సత్కారములచే ఆ రాత్రినంతయు వెళ్లబుచ్చి, తెల్లవారిన పిమ్మట ఆ ప్రతిమలను తిరిగి పూజించి, బ్రాహ్మణునకు దానమియ్యవలయును. ఈ ప్రకారము వ్రతమాచరించి, అక్కడనుండు పెద్దలకు నమస్కారముచేసి, క్షమార్పణ గోరి, పిమ్మట స్నేహితులు బంధువులు పెద్దలు మొదలగువారితో గూడి భుజింపవలయును.

ఓ చిన్నవాడా! ఈ ప్రకారము దశమీ వ్రతమును శ్రద్ధతో చేసిన వాడు తన మనస్సున కోరిన సమస్త కోరికలను పొందును. పురాతనమగు ఈ దశమీ వ్రతమును స్త్రీలు ముఖ్యముగా చేయవలయును.

స్త్రీలు ముఖ్యముగా చేయుటకు హేతువేమనగా సమస్త ప్రాణిసమూహముల యందు థర్మాతి కార్యముల చేయుటయందు స్త్రీలు మిక్కిలి శ్రద్ధ గలవారలై యుందురు. అందువలన, స్త్రీలు తప్పకజేయవలెను.

ఓ మునీశ్వరా! ఐశ్వర్యమునొసగునదియు, కీర్తినిచ్చునదియు, ఆయుస్సును ఇచ్చునదియు, సమస్త కోరికలనొనుగునదియు కాబట్టి, ఈ దశమీ వ్రతమును నీకు చెప్పితిని మూడు లోకముల యందును దీనితో సమానమగు వ్రతము మరియొకటిలేదు.

బ్రహ్మ మానసపుత్రులలో శ్రేష్ఠుడవగు, ఓ సనత్కుమారా! ఈ వ్రతము ఇట్టిది, అట్టిది అని విశేషముగా చెప్పనవనరములేదు. ఎవరైనను కోరికలనపేక్షించి, ప్రతి శుక్ల దశమి యందును, పది దిక్కులను పూజింతురో వారి యొక్క హృదయమందుండెడి సమస్య కోరికలను దిక్కులు సంతసించి ఇచ్చును.

ఓ మునీశ్వరా! ఈ వ్రతము మోక్షము నొసగు విషయములో సులభముగా ఒసగును, ఈ విషయములో విచారణ ఎంత మాత్రము చేయనక్కరలేదు, దీనితో సమానమగు వ్రతము ఇది వరకు ఎక్కడను జరిగియుండలేదు, ఇక మందు ఎక్కడను జరుగదు.

 అని, ఈ ప్రకారముగా సాంబమూర్తి, సనత్కుమార మునీశ్వరునితో (Munishwara) చెప్పెను.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – “ఆశాదశమీ వ్రత కథనం నామ” అష్టాదశోధ్యాయస్సమాప్తః. 

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి పంతొమ్మిదవ అధ్యాయం >>

Also Read

Leave a Comment