Shravana Masa Mahatmyam Day – 16 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 16

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణమాసంలోని కోటి లింగముల (Koti Linga) మహిమ గురించి చెబుతాడు. కోటి లింగాలను పూజించలేనివారు లక్ష, వేయి, నూరు లేదా ఒక లింగాన్ని పూజించినా శివలోకం (Sivaloka) చేరుకుంటారని తెలియజేస్తాడు. శివ మంత్రాన్ని భక్తితో జపించడం, పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల అకాల మృత్యు భయం తొలగి, సంతానం, ఐశ్వర్యం లభిస్తాయని పేర్కొంటాడు. ఈ మాసంలో ఉపవాసాలు, హోమాలు, వేద పారాయణలు (Veda Parayanam) చేయడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని, బ్రహ్మహత్య వంటి మహాపాపాలు కూడా నశిస్తాయని వివరించాడు. పురుషసూక్తం (Purusha Sukta) పఠించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని, గ్రహ యజ్ఞాలు చేయడం ద్వారా ఉత్తమ లోకాలు పొందవచ్చని శివుడు తెలియజేస్తాడు.

తరువాత, ఆదివారం వ్రతం గురించి వివరిస్తూ, సుశర్మ అనే దరిద్ర బ్రాహ్మణుడి కథను చెబుతాడు. ఒకసారి ఒక ఇంటిలో కొందరు స్త్రీలు ఆచరిస్తున్న ఆదివార వ్రతం గురించి తెలుసుకుని, సుశర్మ వారిని అడిగి వ్రత విధానాన్ని తెలుసుకుంటాడు. శ్రావణ మాసంలో ఆదివారం నాడు మౌనంగా స్నానం చేసి, సూర్యుని (Lord Surya) పూజించాలని, పన్నెండు తమలపాకుల మండలాలను ఏర్పరిచి ఎర్రని గంధంతో సూర్యబింబాన్ని ఆవాహన చేయాలని స్త్రీలు అతనికి చెబుతారు. ఈ పూజలో ఎర్రని పుష్పాలు, అక్షతలు ఉపయోగించి, పన్నెండుసార్లు నమస్కరించి, ప్రదక్షిణలు చేసి ఆరు పోగుల తోరాన్ని చేతికి కట్టుకోవాలని సూచిస్తారు. ఈ వ్రతం ఆచరించిన సుశర్మ దరిద్రం నుండి బయటపడి ధనవంతుడు అవుతాడు. అతని కుమార్తెలు కూడా ఈ వ్రత ప్రభావం వల్ల అద్భుతమైన సౌందర్యాన్ని పొందుతారు. వారి సౌందర్యానికి ముగ్ధుడైన రాజు వారిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా ఈ వ్రతం ఆచరించిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని ఈశ్వరుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.

🍃🌷కోటి లింగముల మహిమ – ప్రకీర్ణక నానావ్రత రవివార వ్రతాది కథనం:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు.. 

కోటి లింగముల యొక్క మహిమను చెప్పెదను వినుడు. ఒక్క లింగము యొక్క మహిమను చెప్పడం సాధ్యము కాక యుండగా కోటిలింగముల యొక్క మహిమను చెప్పుటకు నెట్లు సాధ్యమగును.

కోటి లింగములను పూజించుటకు సమర్థత లేని పక్షమున – లక్ష లింగములను గాని, వేయి లింగములను గాని, నూఱు లింగములను గాని లేక ఒక్క లింగమును (Sivalinga) గాని పూజించినయెడల నా లోకములో, నా సమీపమున ఉండగలడు.

ఆఱు అక్షరములు గల ఈశ్వరుని సంబధమగు మంత్రముచే భక్తి, శ్రద్ధలు గలిగిన మనస్సుతో గూడినవాడై సాంబమూర్తిని పూజింపవలయును.

నవగ్రహములను (Navagraha) గురించి హోమము చేసి, అనంతరము ఉద్యాపనము చేయవలయును. అనంతరము బ్రాహ్మణులను కూడ భుజింపచేయవలయును.

శ్రావణ మాసములో శివుని – పంచామృతములచే అభిషేకము చేసిన వానికి ఆకాలమృత్యువు లేకపోవుటయు, సంతానవంతుడుగా ఉండుటయు, సమస్త విపత్తులు నశించుటయు, సమస్త ఐశ్వరములు వృద్ధిపొందుటయు గలిగి సర్వకాలముల యందును నా సన్నిధానమున ఉండగలడు.

అట్టి వాడు నిత్యము పంచామృతములతో భుజించువాడును, గోవుల (Cows) సంపత్తు గలవాడును, మిక్కిలి మనోహరముగ సంభాషించువాడును, సాంబమూర్తికి ప్రియమైనవాడు అగును. 

అన్నమును భుజంపక, హోమమును చేయగా మిగిలిన హవిస్సును భుజించినవాడు వ్రీహులు మొదలగు సమస్త ధాన్యములతో ఎల్లప్పుడు నిండియుండువాడు అగును.

విస్తళ్ల యందు భుజించినవాడు, బంగారు పాత్రలయందు భుజించువాడగును. కూరను వదలివేసిన వాడు విక్రమార్కుడు మొదలగువారి వంటి శకములను చేయు రాజగును.

భూమియందు శయనించిన యెడల కైలాసము పొందగలడు. శ్రావణ మాసములో ప్రాతఃకాలమున స్నానము చేసిన యెడల సంవత్సరము చేసిన ఫలము పొందును.

ఈ మాసములో ఇంద్రియములను జయించిన వాడయ్యెనేని ఇంద్రియములకు బలము కలవాడగును.

స్ఫటికము (Crystal), వెండి, బంగారు, మట్టి మొదలగు వానితో ఏర్పడిన లింగము గాని, మరకతము గాని లేక స్వయముగ పుట్టినదియు లేక చేయబడినదియు, లేక మరియొక ధాతువులు – మంచి గంధము, నవనీతము మొదలగువానితో చేయబడినదిగాని ఏ లింగమందైనను ఒక్కసారి పూజించిన నాడు అనేక బ్రహ్మ హత్యాది పాపములను పోగొట్టుకొన్నవాడగును, సూర్యచంద్ర గ్రహణములయందును (Grahana) పుణ్య క్షేత్రములయందును మంత్రములను జపించిన సిద్ధికలవి అగును.

పూర్వమున చెప్పబడినట్టి సమయముల యందు ఒక్కసారి జపము చేసినయెడల లక్ష పర్యాయములు జపము చేసిన ఫలము కలుగును, మరియు ఈ శ్రావణ మాసములో ఒక్క పర్యాయము జపించిన యెడల ఇతర కాలములయందు వేయి పర్యాయములు చేసినంత ఫలము కలుగును. ఆ ప్రకారమే నమస్కారములు ప్రదక్షిణలు కూడా ఫలమును ఇచ్చునవియగును.

నాకు ప్రీతికరమైన శ్రావణ మాసములో వేదపారాయణము (Veda) చేసిన యెడల సమస్త వేదమంత్రములు సిద్ధి కలవి యగును. ఈ మాసములో శ్రధ్ధ కలిగి పురుషసూక్తము ఎన్ని యక్షరములు కలిగియున్నదో అన్ని వేల పర్యాయములు పఠించిన యెడల కలియుగములో నాలుగు రెట్లు ఫలము గలదియగును, లేక ఎన్ని అక్షరములు కలిగియుండునో అన్ని వందల పర్యాయములు చేయవలెను. అన్ని పర్యాయములు చేయుటకు సమర్థుడు కానియెడల, నూరు పర్యాయములు పఠించిన యెడల బ్రహ్మహత్య మొదలగు సమస్త పాపముల వలన విడువబడును. సందేహము లేదు. గురు భార్యా సంభోగము చేసిన వానికి ఇది మిక్కిలి ప్రాయశ్చిత్తముగా చెప్పబడినది. గాన దీనితో సమానమైనదియు, పవిత్రమైనదియు, పాపములను పోగొట్టునదియు మరియొకటి లేదు. ఒక్క దినమైనను పురుషసూక్త పఠనము లేకుండా వెళ్లబుచ్చకూడదు. అది అసత్యమని చెప్పిన వాడు అనేక జన్మముల పర్యంతము నరకమును పొందువాడగును.

ధూపము, గంధము, పుష్పములు, మొదలగు వానిచే పూజించి, నైవేద్యమును చేసి, పిమ్మట సమిధలు అన్నము తిలలో ఆజ్యము మొదలగు వానిచే గ్రహములను గురించి హోమము చేసిన యెడల గ్రహయజ్ఞమని చెప్పబడును. ఆ గ్రహముల రూప ప్రకారముగా ధ్యానము చేసి, యధావిధిగా కోటి పర్యాయములు గాని, లక్ష పర్యాయములు గాని, పదివేల పర్యాయములు గాని, తన శక్తికొలది వ్యాహృతులను ఉచ్చరించుచు తిలలతో (Til) హోమము చేసిన గ్రహ యజ్ఞమని చెప్పబడుచున్నది. అందువలన ఉత్తమ లోకములను పొందగలరు.

ఓ పుణ్యాత్మా! వారములలో మొదటిదగు ఆదివారమును (Sunday) గురించి చెప్పెదను వినుము. మరియు ఇందు గురించి పూర్వము జరిగిన యొక కథను జెప్పెదను వినుము.

పూర్వకాలమున ప్రతిష్ఠా నగరమందు దరిద్రుడును, కుత్సిత స్వభావుడును, భిక్షముచే జీవించువాడును అగు సుశర్మ యను బ్రాహ్మణుడు కలడు. ఒకానొకప్పుడు ఆ బ్రాహ్మణుడు భిక్షముచే ధాన్యమును సంపాదించుటకు ఆ పట్టణములో తిరుగుచుండగా, ఒక గృహస్థుని ఇంట కొందరు స్త్రీలు కలిసి ఆదివార వ్రతమును చేయుచున్నవారలై అచ్చటకు వచ్చిన బ్రాహ్మణుని చూచి, ఈ బ్రాహ్మణునకు పూజావిధిని కనుపరచగూడదని, ఆ స్త్రీలు అనుకొనిరి.

ఆ స్త్రీలు పూజావిధిని కనుపరచక పోవుటచే, ఓ నారీమణులారా! మీరు చేయు చుండెడి వ్రతమును నేను జూడకుండగ జేసితిరి, ఏమి కారణము! దయాస్వభావము గల విూరు నా యందు దయనుంచి చెప్పవలయును. మూడు లోకముల యందును పరోపకారముతో సమానమగు ధర్మం లేదు. అని బ్రాహ్మణుడు ఆ స్త్రీలను ప్రార్థించెను.

సర్వ భూతములయందు సమాన భావముగల సజ్జనులకు పరోపకారం చేయుట తమ స్వకార్యముగానే భావింతురు. కాబట్టి నేను దరిద్రుడను అగుటవలన ఈ వ్రతమును మీ వలన విని నేను ఆచరింపవలయునని కోరిక గలిగియున్న వాడను గాన, వ్రత విధానమును వ్రతఫలమును జెప్పవలయునని ఆ బ్రాహ్మణుడు స్త్రీలను అడిగెను.

🌻ఆ స్త్రీలు ఇట్లు పలికిరి:

ఓ బ్రాహ్మణుడా! నీవు యోగ్యమైన మనస్సు కలవాడవు కావు. ఈ వ్రతమును నీకు చెప్పితిమేని దీనియందు ఆసక్తి ఉంచువాడవు కావు. భక్తిగా ఉండవు. మరచిపోయెదవు, ఆక్షేపింతువు కాబట్టి నీకు చెప్పకూడదని, ఆ స్త్రీలనిరి.

ఇట్లు పలికిన ఆ స్త్రీల మాటలను విని, ఆ బ్రాహ్మణుడు…

ఓ పతివ్రతలారా! నేను జ్ఞానము కలవాడను, భక్తి కలవాడనైతిని కాబట్టి ఈ వ్రతమును జెప్పుమని అడిగెను. ఇట్లు పలికిన ఆ బ్రాహ్మణుని మాటలను విని, ఆ స్త్రీలలో నేర్పుగల ఒక స్త్రీ ఆ వ్రతము యొక్క యథార్థమును సవిస్తరముగా ఆ బ్రాహ్మణునితో నిట్లు జెప్పెను.

శ్రావణమాసములో మొదటగా వచ్చెడి ఆదివారము నందు ప్రాతఃకాలమున మౌనముగా నుండి చల్లని ఉదకములో స్నానము జేయవలయును. ప్రాతఃకాల సంబధమైన సంధ్యావందనాదికృత్యముల దీర్చుకొని, తమలపాకులను పండ్రెండు మండలములను ఏర్పరచ వలయును. ఆ మండపము నందు సూర్యబింబము వలెనే గుండ్రముగా ఎర్రని గంధముతో పండ్రెండు మండలముల నేర్పరచి సంజ్ఞాఛాయా సమాయుక్తుడగు సూర్యుని ఆవాహనము చేసి ఎర్రనిగంధముతో పూజ చేయవలయును. మోకాళ్లను భూమి యందుంచి పన్నెండు పర్యాయములు అర్ఘ్యములు ఇవ్వవలయును ఎర్రని గంధముతో మిశ్రితములైన బియ్యముతోను పూజచేయ వలయును. శ్రద్ధయు, భక్తియు, గలిగి దాసనపుష్పములు, ఎర్రని అక్షంతలు మరియు ఇతర ఉపచారముల చేతను సూర్యునికి పూజ చేయవలయును.

కొబ్బరిచిప్పలు, పంచదార, పటిక బెల్లము, మొదలగునవి నివేదనము జేసి, సూర్యుని నిరూపణ చేయునట్టి పండ్రెండు మంత్రముల చేత స్తోత్రము చేసి పండ్రెండు నమస్కారములను, పండ్రెండు ప్రదక్షిణములు చేసి, ఆరు పోగులు గల తోరమును పోసి ఆరు ముడులను వేసి, ఆ తోరమును సూర్యునకు సమర్పించి, దానిని కంఠము నందు ధరించవలయును. పిమ్మట పండ్రెండు ఫలములను బహ్మణునకు వాయనమూడు ఇవ్వవలయును.

ఈ వ్రత విధానము పూర్వమెవ్వరికిని తెలియదు, కాబట్టి, ఈ ప్రకారము వ్రతము చేసిన యెడల దరిద్రుడు ధనము పొందును, పుత్రులు లేనివాడు పుత్రులను పొందును. కుష్ఠు రోగి రోగము వలన విముక్తుడగును, బంధింపబడిన వాడు బంధనము వల్ల విముక్తుడగును, మరి యే ఇతర రోగములు కలవాడైనను వానివలన విడువబడును.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇదియది అని చెప్పనేల, ఈ వ్రతము చేయువాడు వ్రత మహిమచే కోరినవన్నియు పొందగలడు.

ఈ ప్రకారము శ్రావణ మాసములో వచ్చిన నాలుగు వారముల యందు గాని అయిదు వారముల యందు గాని వ్రతమును జేసి పిమ్మట వ్రతము సంపూర్తినొందుటకు ఉద్యాపనము జేయవలయును.

ఓ బ్రాహ్మణోత్తమా! ఈ ప్రకారము చేసిన సమస్త కోరికలు పొందగలవని ఆ స్త్రీలు చెప్పగా, ఆ బ్రాహ్మణుడు వారికి నమస్కారము చేసి తన ఇంటికి వెళ్లి, ఆ స్త్రీలు చెప్పిన ప్రకారము వ్రతమునాచరించి, ఆ వ్రత విధానమునంతయు తన ఇద్దరు కుమార్తెలకు జెప్పెను. ఆ బ్రాహ్మణుని కుమార్తెలు తండ్రి చెప్పిన కథను వినుటవలనను ఆయన చేసిన పూజ చూచుట వలనను, ఆ వ్రత ప్రభావముచే దేవతా స్త్రీలతో సమానమైన సౌందర్యము గలవారైరి. అది మొదలుకొని ఆ బ్రాహ్మణుని ఇంట లక్ష్మీదేవి (Goddess Lakshmi) నివసించియుండెను. అనేక విధములుగా ఆ బ్రాహ్మణుడు ధనమును సంపాదించుచు లక్ష్మీ సంపన్నుడని ప్రసిద్ధికెక్కెను.

ఒకానొకప్పుడు ఆ పట్టణపు రాజు వీధి వెంబడి వచ్చుచుండగా, ఆ బ్రాహ్మణుని ఇంటి వద్దకు వచ్చుసరికి కిటికీ గుండా ఇద్దరు మిక్కిలి సౌందర్యము గల స్త్రీలు కనబడిరి. వారు, లోకములో పద్మము, చంద్రుడు మొదలగు వస్తువులెవ్విగలవో వానినన్నిటిని తమ దేహము అవయవముల యొక్క సౌందర్యచే తిరస్కరించు చుండెడివారు. అట్టి మిక్కిలి సౌందర్యవతులగు ఆ స్త్రీలను జూచి, రాజు మోహము జెంది క్షణకాలం మై మరచి పరవశుడై వెంటనే ఆ బ్రాహ్మణుని పిలిచి ఆయన కుమార్తెలను తనకిమ్మని అడిగెను.

ఆ స్త్రీలను రాజు కోరుటచే, ఆ బ్రాహ్మణుడు సంతసించిన వాడై తన కుమార్తెలను రాజునకిచ్చి పెండ్లి చేసెను. ఆ కన్యకలు కూడా తమకు రాజు భర్తయగుట వలన మిక్కిలి ఆనందము గల వారైరి.

బ్రహ్మ పుత్రుడవగు, ఓ సనత్కుమారా!

ఆ స్త్రీలు అది మొదలుకొని పుత్రులు పౌత్రులు మొదలగువారితో గూడ ఈ వ్రతమును జేసిరి. గాన, ఇట్టి విశేష ఫలదాయకమగు వ్రతమును నీకు జెప్పితిని. ఈ వ్రతక ధను వినినంత మాత్రముననే వ్రతమును చేసిన ఫలము నొంది సమస్త కోరికలను పొందగలడు.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే “ప్రకీర్ణక నానావ్రత రవివార వ్రతాది కథనం” నామోధ్యాయ స్సమాప్తః.

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి పదిహేడవ అధ్యాయం >>

Also Read

Leave a Comment