Shravana Masa Mahatmyam Day – 14 | శ్రావణమాస మహాత్మ్యము

Shravana Masa Mahatmyam Day - 14

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. 

శ్రీ స్కాంద పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.

ఈ అధ్యాయంలో, ఈశ్వరుడు సనత్కుమారునికి శ్రావణ శుద్ధ పంచమి నాడు ఆచరించవలసిన “నాగ పంచమి – Naga Panchami” వ్రతం గురించి వివరించాడు. ఈ వ్రతంలో నాగదేవతలను పూజించాలని, చవితి (Chaviti) రోజు ఒక పూట భోజనం చేసి, పంచమి నాడు రాత్రి భోజనం చేయాలని సూచించాడు. బంగారంతో (Golden) లేదా మట్టితో ఐదు పడగలు గల సర్ప ప్రతిమను చేసి, దానిని పూజించాలి. ఇంటి ద్వారానికి ఇరువైపులా గోమయంతో సర్పాల బొమ్మలు గీసి, వాటికి గరిక, గన్నేరు వంటి పుష్పాలతో పూజ చేయాలని చెబుతాడు. పుట్టలో పాలు, పంచదార వంటి మధుర పదార్థాలు ఉంచి పూజ చేయాలని, ఆ రోజు గారెలు వంటివి చేయకూడదని, ఇనుప పాత్రలు వాడకూడదని నియమాలు తెలియజేశాడు. వేయించిన శనగలు, బియ్యం, జొన్నలు నివేదన చేసి, వాటినే పిల్లలకు పెడితే దంతపుష్టి కలుగుతుందని పేర్కొంటాడు. ఈ వ్రతం ఆచరించడం వల్ల సర్పభయం ఉండదని శివుడు (Shiva) తెలియజేస్తాడు.

నాగపంచమి వ్రతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, సర్పదష్టులై మరణించినవారు అధోగతి పాలై సర్పాలుగా (Serpents) జన్మిస్తారని, ఈ వ్రతం ఆచరించడం వల్ల అటువంటి దోషాలు తొలగి, పూర్వీకులకు ముక్తి లభిస్తుందని శివుడు చెబుతాడు. సంవత్సరమంతా వ్రతం ఆచరించి, సంవత్సరాంతంలో ఉద్యాపన చేయాలని, ఆ సమయంలో బంగారు నాగ ప్రతిమ (Naga statue), గోవును దానం ఇవ్వాలని సూచిస్తాడు. సర్పాలను చంపినవారు, అబద్ధాలు చెప్పినవారు, లోభులు తిరిగి సర్పాలుగా జన్మిస్తారని పేర్కొంటూ, ఈ దోషాలన్నింటికీ నాగపంచమి వ్రతమే సరైన ప్రాయశ్చిత్తమని తెలియజేస్తాడు. ఈ వ్రతం ఆచరించిన వారికి శేష, వాసుకి వంటి సర్పరాజాలు సంతోషించి, శివకేశవులను (Shiva Keshava) ప్రార్థిస్తారని, తద్వారా వ్రతం చేసిన వారికి సమస్త సుఖాలు, చివరికి మోక్షం లభిస్తాయని ఈశ్వరుడు సనత్కుమారునికి తెలియజేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు.

♦️చతుర్దశాధ్యాయము:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll

🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు..

ఓ మునీశ్వరా! యిక ముందు శ్రావణ శుద్ధ పంచమి దినంబున చేయతగిన వ్రతం చెప్పెదను.

చవితి యందు ఒక్కసారి భుజించి, పంచమి దినమున రాత్రి భుజించ వలయును. బంగారంతో గాని, వెండితో (Silver) గాని, కొయ్యతో గాని, మట్టితో గాని ఐదు పడగలు గల సర్పం ఏర్పరచి దానిని పంచమి దినమున పూజింపవలయును. మరియు ద్వారమునకు రెండు ప్రక్కలను విషముతో అధికంగా నుండు సర్పములను గోమయంతో లిఖించి, గరిక చిగుళ్లు, కరవీర పుష్పములు, గన్నేరు పుష్పములు, జాజి పువ్వులు, సంపంగి పువ్వులు, గంధం, అక్షతలు, మొదలగు వానిచే పూజించి ధూప దీపాదులను ఇవ్వవలయును.

అనంతరము నెయ్యి, పరమాన్నము, కుడుములు, మొదలగు వానిచే బ్రాహ్మణులను భుజింపచేయ వలయును మరియు అనంతరము వాసుకి (Vasuki), శేషుడు, పద్మనాభుడు, కంబలుడు, కర్కోటకుడు, నాగుడు, ధృతరాష్ట్రుడు, శంఖపాలుడు, కాళీయుడు, తక్షకుడు, మొదలగు సర్పరాట్టులను, మరియు ఇతర సర్పములను గోడయందు పసుపు తోటి, మంచి గంధము తోటి, ఆకారములను లిఖియించి పుష్పములు మొదలగు వానిచే పూజింపవలయును. పుట్టయందు పూజచేసి దానిలో నుండు సర్పములు తాగుటకు పాలు పోయవలయును.

మరియు నేతితో మిళితమైన పంచదార మొదలగు మధుర పదార్ధములను ఇష్టమైనట్లు ఉంచవలయును. ఆ దినంబున పోళీలు మొదలగునవి చేయ గూడదు. ఇనుము పాత్రను వాడగూడదు. నివేదనకు పరమాన్నమును భక్తితో ఉంచ వలయును. వేయించిన శనగలును బియ్యమును జొన్నలును సర్పములకు నివేదన చేయవలయును. వానినే తాను భుజింపవలయును. ఆ నివేదన చేయబడిన శనగలు మొదలగు వానిని పిల్లలకు పెట్టవలెను. వానిని భుజించిన పిల్లలు దంత పుష్టి గలవారగుదురు, మరియు స్త్రీలు అలంకరించుకొని పుట్టవద్ద సంగీతము పాడుటయు, వాద్యములను వాయించుటయు, విశేషమహో త్సవములను జరుపుటయు చేయవలయును. ఇట్లు చేసిన ఎడల, వానికి ఎప్పటికిని సర్పముల వలన భయము కలుగబోదు.

ఓ మునీశ్వరుడా! ప్రపంచమునకు మేలు కొరకు మరియొక సంగతిని నీకు తెలియ పరచెదను దానిని వినుము. ఓ చిన్నవాడా! సర్పముచే కరవబడినవాడు, మృత్యువునొంది, అధోగతుడై తిరిగి సర్పముగా బుట్టును. కాబట్టి,  అట్టి దోషము లేమియు పొంద కుండా ఉండుటకుగాను, నాగ పంచమీ వ్రతమును చేయవలెను. కాబట్టి, పూర్వము చెప్పిన రీతిగా ఒక్క సారి భుజించుటయు, బ్రాహ్మణులతో గూడ సర్పపూజ (Sarpa Puja) గావించుటయు చేయవలెను. ఈ ప్రకారము పండ్రెండు మాసములలో ప్రతి మాసము నందును వ్రతము ఆచరించవలయును. సంవత్సరము పూర్తికాగానే శుక్ల పక్ష పంచమి దినంబున సర్పముల తృప్తికొరకు బ్రాహ్మణులను, యతీశ్వరులను భుజింపచేయ వలెను. కథలను వినిపించిన వానికి రత్నములతో గూర్చబడిన బంగారపు నాగ ప్రతిమను, దూడ గలదియు, బంగారపు కొమ్ములు గలదియు, వెండి డెక్కలు గలదియు విశేషముగా పాలు ఇచ్చునదియు ఐన గోవును దానమివ్వ వలయును.

దానమిచ్చు సమయమున – సమస్తమును వ్యాపించిన వాడును, సమస్తమును ఇచ్చువాడును, ఎవనిచే జయింపబడని వాడును అగు భగవంతుని స్మరింపుచు,  నిట్లు చెప్పవలెను…

ఓ భగవంతుడా! నా వంశంబున సర్పదష్టులై మృతినొంది, అధోగతులు అయియుండిరేని వారందరు ఇప్పుడు నేను చేసిన వ్రాత ప్రభావముచే ముక్తి నొందుదురు గాక! అని చెప్పి మంచి గంధముతో కలిపిన అక్షతలను ఉదకముతో గూడ భక్తి పూర్వకముగా భగవంతుని ఎదుట ఉదకముతో విడువవలెను. ఈ ప్రకారము వ్రతమాచరించిన ఎడల ఇదివరలో మృతినొందిన వారు,  ఇకముందు మృతినొందెడి వారును సర్పముల వలన భయమునొందక స్వర్గమును పొందగలరు.

ఓ మునీశ్వరుడా! ఈ ప్రకారము తన వంశస్తులనందరిని తరింపజేసి తానును అప్సర (Apsara) స్త్రీలచే సేవింప బడును. శివలోకమును పొందును. తనకు శక్తి కొలది లోభింపక వ్రతమును చేసినవాడు పూర్వం చెప్పబడిన ఫలమును పొందును. భక్తి కలవారై శుక్ల పక్ష పంచమి (Shukla Paksha Panchami) యందు సర్పములను పుష్పముల చే పూజింపుచు నక్త భోజనము చేసిన వారి యొక్క గృహముల యందు భయము ఎంత మాత్రము కలగనీయక సర్పములు మణుల కాంతులతో ప్రకాశింపుచు సంతోషముతో తిరుగుచుండును.

ఈ వ్రతమును ఆచరింపని బ్రాహ్మణులు గృహదానమును స్వీకరించిన ఎడల విశేష నరకమును అనుభవించి సర్పరూపులగుదురు.

ఎవరైనను సర్పములను చంపినచో వారు మృతినొందిన పిమ్మట రెండవ జన్మమునందు పుట్టిన సంతావము నశించువారుగాని పుత్రులు లేని వారుగాని కాగలరు. స్త్రీల యందు కార్పణ్యముగా ఉన్నట్టివారును, ఆక్షేపణలను చేసిన వారును, అబద్ధము పలికినవారును సర్పములుగా పుట్టుదురు.

మరియు ఇతరములగు అనేక కారణముల వలన సర్ప స్వరూపములుగా పుట్టెదరు, కాబట్టి, అట్టి సమస్త దోషములకును ఈ చెప్పబడిన వ్రతము మిక్కిలి ప్రాయశ్చిత్తముగా చెప్పబడెను. ద్రవ్యలోపం లేకుండా నాగపంచమీ వ్రతమును చేసిన ఎడల సమస్త సర్పములకు అధిపతులగు శేషుడును, వాసుకియు సంతృప్తులై వ్రతము చేసిన వానికి మేలు చేయుట కొరకు దోసిలి పట్టుకొని ప్రభువులగు విష్ణుమూర్తిని (Lord Vishnu) సాంబమూర్తిని ప్రార్థించెదరు.

సర్వదేవతా సార్వభౌములగు శివ కేశవులు – శేషవాసుకుల విజ్ఞాపనచే సంతుష్టాంతరంగులై సమస్త కోరికలనొసగుచున్నారు. ఇట్లు వారు ఒసగిన సమస్త కోరికలను ఇహలోకంబున అనుభవించిన పిమ్మట నాగ లోకమున (Naga Loka) కేగి అచ్చట సంభవించిన సమస్త భోగములను అనుభవించి, అనంతరం మంగళపదములగు వైకుంఠము, కైలాసము  లోకముల కేగి అచ్చట శివవిష్ణువులకు భృత్యగణములతో చేరి, సేవ చేయుచు, అనంతరం పరమ సుఖకరమగు ముక్తినొందెదరు.

ఓ చిన్నవాడా! ఇట్టి శ్రేయస్కరముగు నాగపంచమి వ్రతమును జెప్పితిని, మరియు ఇంతకంటే మరియొక వ్రతం ఏదియైనను నీవు వినదలచినచో దానిని గూర్చి అడుగుము చెప్పెదను.. అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – “నాగపంచమీ” వ్రత కథనం నామ చతుర్దశో ధ్యాయ స్సమాప్తః. 

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

తదుపరి పదిహేనవ అధ్యాయం >>

Also Read

Leave a Comment