4వ అధ్యాయం -శ్రావణ శుధ్ధ చవితి – దుర్వా గణపతి వ్రతము

భారతీయ సంస్కృతిలో శ్రావణమాస మహాత్మ్యమునకు – Shravana Masa Mahatmyam ఒక ప్రత్యేకత ఉంది. అందులో శ్రావణ మాసం (Shravan Month) అత్యంత విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసం శివారాధనకు, ఆధ్యాత్మిక చింతనకు అనుకూలమైనదిగా చెప్పబడుతుంది. శివభక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో పరమశివుని (Lord Shiva) ఆరాధించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శ్రీ స్కాందపురాణం పురాణం (Skanda Purana) నందు ఈశ్వరుడు మరియు సనత్కుమారుల మధ్య జరిగిన సంభాషణలో శ్రావణమాసం (Savan) యొక్క గొప్పదనాన్ని మరియు శ్రావణ మాస మహాత్మ్యాన్ని సవివరంగా వర్ణించడం జరిగింది. శ్రావణ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ధర్మకార్యాలు విశేష ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాసం యొక్క మహిమ మరియు ప్రాముఖ్యత దానిని ఆచరించాల్సిన ధర్మాలు, వ్రతాల (Vrat) గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి అత్యంత ప్రయోజనకరం.
కథ క్లుప్తముగా
ఈ అధ్యాయంలో ఈశ్వరుడు (Lord Shiva) సనత్కుమారునికి శ్రావణ శుద్ధ చవితి నాడు ఆచరించవలసిన దూర్వా గణపతి వ్రతం (Durva Ganapati Vratham) గురించి వివరిస్తాడు. ఇది మూడు లోకాల్లో ప్రసిద్ధికెక్కిన వ్రతమని, పూర్వం పార్వతి (Parvati), సరస్వతి (Saraswati), ఇంద్రుడు, విష్ణువు (Lord Vishnu) వంటి దేవతలు కూడా దీనిని ఆచరించారని చెబుతాడు. ఈ వ్రతంలో బంగారపు ప్రతిమను పీఠంపై ఉంచి, దానిని ఎర్రని వస్త్రంతో చుట్టిన రాగి కలశంలో ఉంచి, ఐదు రకాల పత్రాలు మరియు ఎర్రని పుష్పాలతో షోడశోపచార పూజ చేయాలని వివరిస్తాడు. ఈ పూజలో విఘ్నేశ్వరునికి పాద్యం, అర్ఘ్యం, ధూపం, దీపం, భక్ష్యాలు వంటివి సమర్పించి, ‘శివ పంచాక్షరీ మంత్రం – Shiva Panchakshari‘ మరియు ఇతర మంత్రాలను జపించాలని పేర్కొంటాడు.
వ్రతం పూర్తయిన తర్వాత ఆ విఘ్నేశ్వర ప్రతిమతో సహా అన్ని వస్తువులను ఆచార్యునికి దానంగా ఇవ్వాలని శివుడు సూచిస్తాడు. ఈ వ్రతాన్ని ఐదు లేదా కనీసం మూడు సంవత్సరాలు ఆచరించి ఉద్యాపన చేస్తే, సమస్త కోరికలు నెరవేరి దేహాంతం తర్వాత కైలాసం చేరుతారని చెబుతాడు. ఉద్యాపన చేయకపోతే వ్రతం నిష్ఫలమని హెచ్చరిస్తాడు. ఉద్యాపనలో మంటపారాధన, హోమాలు, గోదానం వంటివి చేయాలని, దీనిని ఆచరించిన వారికి గణపతి అనుగ్రహంతో పుత్ర పౌత్ర వృద్ధి కలిగి, అన్ని భోగాలు పొంది అంత్య కాలంలో కైలాసం చేరుతారని శివుడు వివరించి, ఈ దూర్వా గణపతి వ్రతం అత్యంత రహస్యమైన, శ్రేష్ఠమైన వ్రతమని ఉద్ఘాటిస్తాడు.
Shravana Masa Mahatmyam Day – 4
శ్రావణమాస మహాత్మ్యము – 4వ అధ్యాయం
🍃🌷శ్రావణ శుధ్ధ చవితి – దుర్వా గణపతి వ్రతము:
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻సనత్కుమార ఉవాచ:
ఓ భగవంతుడా! మనుష్యుడు ఏ వ్రతమును చేసిన అమితమగు సౌభాగ్యమును, పుత్రులను,పౌత్రులను, ధనమును ఐశ్వర్యమును పొందునో వ్రతములలో శ్రేష్ఠమైనటువంటి వ్రతమును చెప్పమని సనత్కుమారుడు సాంబమూర్తి నడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
మునీశ్వరుడా! దూర్వా గణపతి అను ఒక వ్రతము మూడు లోకముల యందు ప్రసిద్ధికెక్కియున్నది. ఆ వ్రతము పూర్వంబున పార్వతీ దేవి, సరస్వతి, ఇంద్రుడు, విష్ణువు, కుబేరుడు (Kubera), మొదలగు వారిచే శ్రద్ధతో చేయబడినది, మరియు ఇతర దేవతులు, మునీశ్వరులు, గంధర్వులు, కింకరులు మొదలైన వారిచేతను ఆచరింపబడి యున్నది.
శ్రావణ మాసములో చవితి తిథి, విద్ధ మొదలగు దోషములు లేక పూర్ణముగానుండునది, పుణ్యప్రదమైనది గాన ఆ దినంబున సమస్త పాపములను పోగొట్టు నట్టి దూర్వా గణపతి వ్రతమును చేయవలయును.
ఒక దంతము పెరికివేయుటచే, ఒక్క దంతముతో ఒప్పుచుండెడి విఘ్నేశ్వరుని యొక్క బంగారపు ప్రతిమను బంగారపు పీఠమునందు ఉండునట్లుగా అట్టి పీఠమును బంగారపు గరికెల మీద నుండునట్లుగాను చేయించి, అట్టి విఘ్నేశ్వరుని ప్రతిమను ఎర్రని వస్త్రములచే చుట్టబడిన రాగి కలశమునందుంచి, ఆ కలశము సర్వతోభద్రము అనెడు మండలమును లిఖియించి, దానియందుంచవలెను. అనంతరం ఎర్రని పుష్పములతోను, ఉత్తరేణి, జమ్మి, గరిక, తులసి దళములు (Tulasi), మొదలగు ఐదు విధములగు పత్రముల చేతను మరియు ఇతర రకాములైన సువాసన గల పుష్పముల చేతను పూజింపవలెను.
అనంతరము ఫలములు ఉండ్రాళ్ళు, భక్ష్యములు మొదలగునవి ఫలహారములుగా సమర్పించి, యధావిధిగా షోడశోపచారముల చేత వినాయకుని (Vinayaka) పూజ చేయవలయును. బంగారపు ప్రతిమ యందు వినాయకుని యథావిధిగా ఆవాహనం చేసితిని కాబట్టి, దయా సముద్రుడవగు విఘ్నేశ్వరుడు (Lord Vigneshwara) వచ్చి, ఈ ప్రతిమ యందు నివసించు గాక.!
రత్నస్థకితమైన ఈ బంగారపు సింహాసనమును కూర్చుండుటకు ఉంచితిని కాబట్టి విఘ్నేశ్వరుడు గ్రహించుగాక.!
పార్వతీదేవి కుమారుడును, విశ్వవ్యాపకుడును, సనాతనుడునగు ఓ విఘ్నేశ్వరా! నా సమస్త విఘ్నములను పోగొట్టుము నీకు పాద్యమును ఇచ్చుచున్నాను గ్రహింపుము. దేవుడును, పార్వతీ దేవి కుమారుడును, బ్రహ్మస్వరూపుడునగు గణాధిపతికి అర్ఘ్యమును ఇచ్చుచున్నాను, ఓ భగవంతుడా ! నీవు గ్రహింపుము. శూరుండును, వరదుడును అగు వినాయకునకు నమస్కారము. ఓ వినాయకా! నాచే ఇవ్వబడు ఈ ఆచమనమును నీవు గ్రహింపుము.
దేవోత్తమా ! గంగాది సమస్త నదులను ప్రార్థించి తీసికొనిరాబడిన జలమును స్నానార్థము ఇచ్చితిని కాబట్టి గ్రహింపుము. సిందూరము కుంకుమచే అలంకరింపబడిన వస్త్రములను ఇచ్చితిని. కాబట్టి, ఓ వినాయకా! నీకు నమస్కారము చేసెదను గ్రహింపుము.
దేవుండును, సమస్త విఘ్నములను పోఁగొట్టువాడును, లంబోదరుడు అగు పార్వతీదేవి కుమారునకు గంధమును ఇచ్చితిని కాబట్టి గ్రహించుగాక! ఓ దేవోత్తమా! ఎర్రని గంధముతో మిశ్రితములగు అక్షతలను భక్తితో ఇచ్చితిని కాబట్టి వానిని గ్రహింపుము.
సంపంగి పుష్పములు, మొగలి పుష్పములు, దాసాని పుష్పములు, మొదలగు వానిచే పార్వతీ దేవి కుమారుని పూజ చేయుచుంటిని కాబట్టి నాయందు అనుగ్రహముంచుగాక! లోకములను రక్షించుటకును రాక్షసులను సంహరించుటకును అవతరించిన కుమార స్వామికి అన్నయగు వినాయకుడు నాచే ఇవ్వబడిన ధూపమును సంతోషముతో గ్రహింపుగాక!
పరంజ్యోతి స్వరూపుడును సమస్త సిద్ధులను ఇచ్చువాడును, మహాదేవ స్వరూపుడును అగు నీకు దీపమును సమర్పించుచున్నాడను, కుడుములు పరమాన్నం లడ్లు మొదలగు భక్ష్యములతో గూడిన నాలుగువిధములైన అన్నముతో గూడ.. (గణానాంత్వా) అను మంత్రం జెప్పి, నీకు నివేదనం చేయుచున్నాను.
ఓ వినాయకా! కర్పూరం, లవంగములు, ఏలకులు, పోకచెక్కలు, తమలపాకులు మొదలగువానితో గూడిన తాంబూలమును ముఖము నందు సువాస కొఱకు ఆదరముతో నీకు ఇచ్చుచున్నాను.
ఓ వినాయకా! బ్రహ్మ యొక్క హృదయమందు ఉన్నదియు, అగ్నికి కారణమైన బంగారపు దక్షిణను ఇచ్చుచుంటిని కాబట్టి, నాకు శాంతిని కలుగ జేయుము. పార్వతీదేవి యొక్క కుమారుడును ఏనుగు ముఖము కలవాడును గణాధిపతియునగు ఓ విఘ్నేశ్వరా! నీ అనుగ్రహము వలన, నేను చేసిన వ్రతము సంపూర్ణమైనది యగుగాక!
ఈ ప్రకారము తమ శక్తికొలది విఘ్నేశ్వరుని పూజించి, ఆ విఘ్నేశ్వర ప్రతిమను అక్కడ ఉంచబడిన యావత్తు ద్రవ్యముతో కూడ ఆచార్యునకు దానపూర్వకముగా సమర్పించవలెను.
భగవత్స్వరూపుడవగు ఓ బ్రాహ్మణోత్తమా! దక్షిణ సహితముగా నేనిచ్చునట్టి విఘ్నేశ్వర ప్రతిమను గ్రహింపుము, మీ వచన ప్రకారముగా, నే చేసిన వ్రతము సంపూర్ణమునొందుగాక యని దానమివ్వవలయును. ఈ ప్రకారము ఐదు సంవత్సరములు వ్రతము చేసి, పిమ్మట ఉద్యాపనము చేసిన ఎడల, ఈ లోకంబున సమస్త కోరికలననుభవించి దేహాంతమందు కైలాసమును బొందును, లేక మూడు సంవత్సరములు చేసినను సమస్త కోరికలను పొందును.
ఉద్యాపనం చేయక, వ్రతము మాత్రమునే చేసిన యెడల వాడు యధావిధిగా చేసినను, వ్రతము నిష్ఫలమగును. కాబట్టి, ఉద్యాపన దినమునందు ఉదయమున నూనెతో తలంటి పోసుకొనవలెను.
విద్వాంసుడు నవటాకు గాని, దానిలో సగముగాని, నాల్గవవంతు గానీ, బంగారముతో విఘ్నేశ్వర ప్రతిమను చేయించి, పంచగవ్యములలో స్నానం చేయించి, గరికలు మొదలగువానితో పూజింపవలెను.
ముందు చెప్పబడెడు పదిమంత్రముల చేతను ప్రతి మనుష్యుడును శ్రద్ధగా పూజింపవలెను.
గణాధీశ, ఉమాపుత్ర, అఘనాశన, వినాయక, ఈశపుత్ర, సర్వసిద్ధి ప్రదాయక, ఏకదంత (Ekadanta), ఇభవక్త్ర, మూషిక వాహన, కుమారగురో నీకు నమస్కారము అని ఈ పది నామముల చేతను వేరువేరుగా పూజింపవలయును. పూర్వ దినము నందు మంటపారాధనము చేసి, మరునాడు ఉదయమున గరికలు, కుడుములు మొదలగువానిచే గ్రహములకును, ప్రధాన దేవతలకును హోమము చేసి అనంతరం పూర్ణాహుతిని గావించి, పిమ్మట ఆచార్యుడు మొదలగువారిని పూజింపవలెను.
ఓ చిన్నవాడా! కడవతో సమానమగు పొదుగు గలదియు, దూడ గలదియు అగు ఆవును గోదానమును, మరియు తన శక్తి కొలది ఇతర దానములను చేయవలయును. ఇట్లు వ్రతమును చేసిన ఎడల సమస్త కోరికలనుపొందును. నాకు ప్రియమైన కుమారుడగుట వలన గణపతి వ్రతం చేయుటచే నేను సంతోషించి, భూలోకమునందు ఉండునంతకాలము సమస్త భోగములనిచ్చి, అంత్యకాలమునకు కైలాస మిచ్చెదను. దూర్వములు వాటివాటికి శాఖలచే ఏ రీతిగా వృద్ధి పొందునో.. ఆ రీతిగానే, దూర్వాగణపతి వ్రతమును చేసినవాడు పుత్రులు పౌత్రులు. మొదలగు సంతానంచే వంశవృద్ధి గలవాడగును.
ఓ మునీశ్వరుడా! రహస్యముగా ఉండునట్టిదియు, మిక్కిలి శ్రేష్ఠమైన దూర్వా గణపతి వ్రతమును గూర్చి నీకు చెప్పితిని. ఇట్టి వ్రతమును సుఖమును అపేక్షించువారందరూ ఆచరింపవలయును.
ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే – దూర్వాగణపతి వ్రత కథనం నామ చతుర్ధధ్యాయస్సమాప్తః|
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
- Shravana Masa Mahatmyam – Day 1 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 2 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 3 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 4 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 5 | శ్రావణమాస మహాత్మ్యము
- Shravana Masa Mahatmyam Day – 6 | శ్రావణమాస మహాత్మ్యము