మకర సంక్రమణం: ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం
మకర సంక్రాంతి: సంస్కృతి, సంప్రదాయాల పండుగ.
సనాతన సంప్రదాయాలు, ధర్మాలకు భారతదేశం నెలవు. ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి (Makar Sankranti). నూతన ఆంగ్లసంవత్సరంలో మొట్టమొదటి పండుగను నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు.
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’ గా పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్థగోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలిపెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు భగ భగ మండే చలి మంటల వేస్తారు. ఉత్తరాయణానికి ముందు రోజు చలి విపరీతంగా పెరగడంతో దీన్ని తట్టుకునేందుకు మంటలు.. దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను కోరుతూభోగి మంటలను వేస్తారు. ఈ రోజు జనవరి 13న భోగి పండుగ కారణంగా భోగి మంటల వెనక ఉన్న పురాణ, శాస్త్రీయ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మకర సంక్రాంతి (Makar Sankranti) పండుగ క్రమం :
సంక్రాంతి పండుగ రంగవల్లుల ముత్యాల ముగ్గులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్నది. తెల్లవారు జామున ప్రతి ఇంటి ముంగిట కళ్ళాపి చెల్లి రంగు రంగుల ముగ్గులు (Rangoli), గొబ్బెమ్మలతో పూజలు, హరిదాసుల కృష్ణార్పణం సంకీర్తనలు ఈ పండుగప్రతికాము. ఇది ప్రతి సంవత్సరము పుష్యమాసం(జనవరి)లో వస్తుంది. సంక్రాతి సమయంలో రైతులు ఇళ్లకు ధన, ధన్యరాశులు చేరుతాయి. ప్రజలు పాడి పంటలతో, సుఖశాంతులతో ఉంటారు. ఈ సమయంలో వచ్చే సంక్రాంతి పండుగను వరుసగా మూడు రోజులు జరుపుకుంటారు. మొదటిరోజు “కామభోగి”, రెండోరోజు “సంక్రాంతి”, మూడోరోజు “కనుమ” (పశువుల పండుగ), కొందరు నాలుగోరోజును “ముక్కనుము”గా జరుపుకుంటారు. ఈ సమయంలో పౌష్యలక్ష్మీతో కళకళలాడే గృహప్రాంగణాలతో ప్రతి ఇల్లు రంగు రంగులతో కొత్త శోభతో కళకళలాడుతుంటుంది. సంక్రాంతి పండుగ రోజున నగరాలలో మరియు పట్టణాలలో నివసించు ప్రతి కుటుంభం సభ్యులు అందరూ తమ తమ పల్లెలకు చేరుకొని నాలుగు రోజుల పండుగను వైభవముగా జరుపుకొంటారు.
మొదటి రోజు:
భోగి (Bhogi): భోగి భాగ్యాల పండుగ
గ్రామాల్లో తెల్లవారుజామునే నాలుగు రోడ్లకూడలిలో భోగిమంటలు వేస్తారు. ఇంటిలోని అరిష్టాలు, సకల రోగాలు, పీడలు తొలిగిపోవడానికి మంటలను వేస్తారు. అలాగే ఇళ్లలో బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకు భోగి పళ్లు పోయడం, దిష్టి తీయడం వంటి ఆచారాలు చేస్తారు.
భోగి మంటలతో ఆరోగ్యం
సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని భావిస్తారు. అయితే ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు గొబ్బెమ్మలను పిడకలుగా చేసి పూజిస్తారు. వాటినే ఈ భోగి మంటలలో ఉపయోగిస్తారు. ఆవుపేడతో చేసిన పిడకలని కాల్చడం వల్ల గాలి పరిశుద్ధవుఅవుతుంది. సూక్ష్మక్రిములు నశించి, ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. ఈ గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటికి ఔషధంగా కూడా పని చేస్తుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల చెక్కలను మరియు ఆవు నెయ్యి కూడా వేస్తారు. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల దూరాలను తగ్గించి ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధన, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం. పెద్దల ప్రకారము భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలను అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి.
భోగి రోజు: బొమ్మల కొలువు.. భోగి పండ్లు సంప్రదాయం.
భోగి(Bhogi) పండుగ రోజున బొమ్మల కొలువు, ముత్తైదువులతో పేరంటం కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా భోగి రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్లు పోస్తారు.రేగు పండ్లను బదరీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగిపండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు, శనగలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. రేగు పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపొతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అని నమ్ముతారు.
బలి తిరిగి భూమిపైకి వచ్చే రోజు..
శాస్త్రాల ప్రకారం ‘భుగ్’ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని, భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం ఈ రోజునే శ్రీ రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. ఇందుకు సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని నమ్ముతారు.
శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కి, ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుంచి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమిచ్చాడనేది మరో కథనం.
పురాణాల ప్రకారం బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారు.
కృష్ణుడు ఇంద్రుడి గర్వాన్ని అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఇదేనని నమ్ముతారు.
శాపం కారణంగా రైతుల కోసం పరమేశ్వరుడు తన వాహనం నందిని భూమికి పంపిన రోజు ఇదే అనేవి కూడా పురాణ గాథ.
భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెట్టగా సూర్యుడి పండుగగా సంక్రాంతి ఆచరిస్తారు.
రెండో రోజు
మకర సంక్రాంతి (Makar Sankranti) లేదా మకర సంక్రమణం
ప్రతి ఇంటి ముంగిట రంగు రంగుల సుందరమైన దృశ్యకావ్యం
మనసుకు హత్తుకునే హరిదాసు జానపద గీతాలు, కేరింతలు, సవ్వడులు వినిపించే తెలుగువారి పండుగ సంక్రాంతి. పల్లెపల్లెలలో పంటల ధాన్యరాసులను చూసుకొని రైతులు సంక్రాంతి పండుగను సంస్కృతితో సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యే సంక్రాంతి నెల అనగా డిసెంబర్ 14, 15వ తేదీలలో గ్రామాల్లో, పట్టణాల్లో రంగవల్లులు, పండుగ సందడి జోరందుకొంటుంది. ఇంటి ఇల్లాలు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిళ్ల ముందు కళ్లాపి జల్లి, రంగురంగుల ముగ్గులు (Rangoli) వేసి గొబ్బెమ్మలను పెట్టి వాటిపై బంతి, చేమంతి, తంగేడు పూలతో అలంకరిస్తారు. నెల రోజులపాటు ఇంటి ముందు వేసే ముగ్గుల్లో చివరి రోజు “ రథం ముగ్గు” వేస్తారు. కార్తీకమాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభను విరాజింపజేస్తాయి.
హరిదాసుల నగర సంకీర్తనలు, గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, కొమ్ముదాసరులు, జంగమదేవరలు, బుడబుక్కల వారు తమ కళలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామాన విశేషమైన శోభాయమానం కలిగిసస్తారు. ఎడ్ల పందాలు, బరువులాగుడు పందాలు, కోడి పందాలు, కబడ్డీ క్రీడలు, గాలిపటాలు ఎగరేయడాలు, గుండాటలతో గ్రామాలను సంబరాల్లో ముంచెత్తుతారు.
రుచికరమైన రకరకాల పిండి వంటలు
సంక్రాంతికి తమ ఇళ్లలో చేసిన రుచికరమైన పిండి వంటకాలు ప్రతేకంగా పొంగలి – పొంగళ్లు, సకినాలు, చెగోడీలు, అరిసెలు, నువ్వుల గారెలుపాయసము తదితర పిండివంటకాలు చేస్తారు. మొదట సంక్రాంతి లక్ష్మికి నైవేద్యంగా పెట్టి అనంతరం ఇంటిల్లిపాదిగా స్వీకరిస్తుంటారు.
మకర సంక్రాంతి : సంస్కృతీ సాంప్రదాయాల కలయిక
రంగవల్లుల శోభలో దివ్యత్వం, కళానైపుణ్యం, ప్రతి ఇంటి ముంగిలీ ఒక పత్రంగా, చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు (Rangoli) చిత్రాలుగా మనోరంజనం కల్గిస్తాయి. గ్రామ, నగర, పట్టాన స్థాయిలలో ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను కూడా అందిస్తారు. స్నానం, దానం, పితృతర్పణం, జపతపాలు, దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా శాస్త్రాలు నిర్దేశించాయి. ‘తిల సంక్రాంతి’గా కొన్నిచోట్ల వ్యవహరించే ఈ పర్వంలో నువ్వుల్ని దేవతలకు నివేదించి, వీటిని పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు. అంతే కాదు తెల్ల నువ్వుల్ని, తీపి పదార్థాలను పంచుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకునే సంప్రదాయం ఉంది. దేవతలు, తల్లిదండ్రులు, సాటి మనుషులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత, ప్రేమను ప్రకటించే పండుగల్లో Sankranti – సంక్రాంత్రికి ప్రాధాన్యముంది.
మూడవ రోజు
కనుమ పండుగ: పాడి పశువులను పూజించే పండుగ
కనుమ పండుగను మూడోరోజు జరుపుకుంటారు. కనుము అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు. హిందువుల సనాతన ధర్మంలో గోవులను ( గోమాతలను) పూజిస్తున్న నేపథ్యంలో ఏరువాకతో జీవనాధారమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఆచారం. ఈ కనుము రోజు పశువులు ఉండే పాకలను శుభ్రం చేస్తారు. పశువులను శుభ్రంగా స్నానం చేయించి అనంతరం వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి, నొసట బొట్టు పెట్టి, మెడలో పూల దండలు వేసి అందముగా పూలతో అలంకరించి గోపూజ నిర్వహిస్తారు. కనుమ పండుగను ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లో రైతులు ఘనంగా జరుపుకుంటారు.
కేరళ (Kerala) : శబరిమలలోని అయ్యప్ప దేవాలయం సమీపంలో ఉన్న పొన్నంబలమేడు కొండమీద మకర సంక్రాంతి రోజున అయ్యప్పస్వామిని (Ayyappa Swamy) మకర జ్యోతి (Makara Jyothi) రూపంలో సందర్శించుకుని భక్తులు స్వయంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లుగా దివ్యానుభూతి పొందుతూ తరిస్తారు.
గుజరాత్ (Gujarat) : సిదా, మనానా, వాసి ఉత్తరాయణం పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సోదరుడు తన అక్కా, చెల్లెళ్లను పిలిచి కొత్త వస్త్రాలను బహుకరిస్తాడు. ఈ సంప్రదాయాన్ని వాళ్లు సిదా అంటారు. మహిళలు అత్తామామలకు కానుకలు ఇవ్వడాన్ని మనానా అని పిలుస్తారు.
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సంప్రదాయలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం.
మకర సంక్రాంతి (Makar Sankranti) వివిధ రాష్ట్రాలలో, వివిధమైన పేర్లతో
- కర్ణాటక: సుగ్గీ హబ్బ (Karnataka: Suggi Habba)
- తమిళనాడు: పొంగల్ (Tamil Nadu: Pongal)
- కేరళ: మకర సంక్రాంతి (Kerala: Makara Sankranti)
- అస్సాం: మాఘ బిహు (Assam: Magh Bihu)
- హిమాచల్ ప్రదేశ్: మాఘి సాజి (Himachal Pradesh: Maghi Saaji)
- పంజాబ్: మాఘి(మాంగి) సంగ్రంద్ (Punjab: Maghi Sangrand)
- జమ్ము: ఉత్తరాయణ్ (Jammu: Uttarayana)
- హర్యానా: సక్రత్ (Haryana: Sakrat)
- రాజస్థాన్: సక్రాత్ (Rajasthan: Sakraat)
- ఒడిస్సా: మకర చౌలా (Odisha: Makara Chaula)
Watch Video:
Credit: @TelugintiKathalu
FAQ
సంక్రాంతి ఎందుకు చేస్తారు?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేసే కాలాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పవిత్రమైన రోజునే మన దేశంలో మకర సంక్రాంతి, పొంగల్ పేరిట పండుగను జరుపుకుంటారు.
మకర సంక్రాంతి దేనికి ప్రతీక?
మకర సంక్రాంతి అనేది సూర్యుని దక్షిణం నుండి ఉత్తర అర్ధగోళానికి ప్రయాణాన్ని జరుపుకునే పండుగ మరియు ఇది శుభ సమయంగా పరిగణించబడుతుంది. మకరం అంటే ‘మకరం’ మరియు సంక్రాంతి అంటే ‘పరివర్తనం’ అని అర్థం.
మకర సంక్రాంతి జనవరి 14 ఎందుకు జరుపుకుంటారు?
మకర సంక్రాంతి అనేది సౌర చక్రం లోని సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన ఖచ్చితమైన సమయ ఖగోళ శాస్త్రప్రకారముగా గుర్తిస్తారు. ఆంగ్లక్యాలెండర్ ప్రకారం జనవరి 14న వస్తుంది, కానీ లీపు సంవత్సరాలలో జనవరి 15న వస్తుంది.
మకర సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగురవేస్తారు?
మకర సంక్రాంతి రోజున నిద్రలేచి గాలిపటాలు ఎగురవేయడం దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఒక మార్గం అని నమ్ముతారు . దేశవ్యాప్తంగా గాలిపటాలు ఎగురవేయడం ద్వారా ప్రజలు పండుగ వేడుకలనుజరుపుకొంటారు.
సంక్రాంతి సమయంలో రంగోలి ప్రాముఖ్యత ఏమిటి?
సంక్రాంతి సమయంలో రంగు రంగుల రంగోలి (ముగ్గులు) సాంస్కృతికత, ప్రతీకాత్మకములకు ప్రతీక.