కార్తీక పురాణం | Karthika Puranam – Day 19

కార్తీక పురాణం – 19 వ అధ్యాయం (చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ)

Karthika Puranam

“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది. స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.

చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ (క్లుప్తముగా)

నారదుడు శ్రీమన్నారాయణుడిని దర్శించి, మనుష్యుల పాపాల గురించి చెప్పాడు. దీంతో శ్రీమన్నారాయణుడు (Sri Narayana) భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణ రూపంలో మనుషులను పరీక్షించారు. చాలామంది మనుషులు శ్రీమన్నారాయణుడిని గుర్తించలేకపోయారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై మునులకు చాతుర్మాస్య వ్రతం గురించి చెప్పారు.

శ్రీమన్నారాయణుడు ఆషాఢ శుద్ధ దశమి (Ashada Shuddha Dashami) రోజున పాలసముద్రంలో శేషశయ్యపై పడుకుంటారు. కార్తీక శుద్ధ దశమి (Karthika Shuddha Dashami) వరకు ఆయన నిద్రిస్తుంటారు. ఈ నాలుగు నెలలను చాతుర్మాస్యం అంటారు. ఈ కాలంలో వ్రతం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి, మోక్షం లభిస్తుంది. శ్రీమన్నారాయణుడు ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. ఈ వ్రతాన్ని చేయని వారికి బ్రహ్మహత్య పాపం వస్తుందని చెప్పారు.

ఈ కథ ద్వారా శ్రీమన్నారాయణుడు చాతుర్మాస్య వ్రతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనం పాపాల నుండి విముక్తి పొందవచ్చు మరియు మోక్షాన్ని పొందవచ్చు. “కార్తీక పురాణం” – 19వ అధ్యాయము (Karthika Puranam – Day 19) నందు ఈ క్రింది విధముగా …

ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్దుడను ఒక మహాయోగి “ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! (Madhava) నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా! మేము ఈ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడు ఎన్ని పురాణములు (Purana) చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయ జాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు.

ఓ “గజేంద్ర రక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము” అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి “జ్ఞాన సిద్దా! నీ స్తోత్ర వచనమునకు నేనెంతయో సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము” అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు “ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగ వలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండునటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు” అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు “ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమునందు అనేక మంది దురాచారులై, బుద్ది హీనులై అనేక పాప కార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.

నేను ఆషాడ శుద్ద దశమి రోజున లక్ష్మిదేవి (Goddess Lakshmi Devi) సహితముగా పాల సముద్రమున శేషశయ్య పై పవళింతును. తిరిగి కార్తిక మాసమున శుద్ద ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసి ఉండియు, వ్రతము చేయని వారికి బ్రహ్మ హత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియమితముగా ఆషాడ శుద్ద దశమి మొదలు శాకములును, శ్రావణ శుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి కల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీవు ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు.” అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేగి శేష పానుపు మీద పవ్వళించెను.

వశిష్టుడు జనక మహారాజుతో “రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి (Vishnu Murthy), జ్ఞాన సిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు ఈ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము – పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.

Also Read

Leave a Comment