కార్తీక పురాణం – 15 వ అధ్యాయం – (దీప ప్రజ్వలనం – ఎలుకకు పూర్వజన్మ స్మృతి)
“కార్తీక పురాణం – Karthika Puranam” హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది. ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో (Karthika Masam) చేసే వ్రతాలు, పూజలు, దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది.స్కంద పురాణము (Skandha Pranam) నందు, వశిష్ఠ మహర్షి (Vashishta Maharshi) జనకునికి ఈ పురాణాన్ని వివరించారు. కార్తీక మాసంలో శివుడు (Lord Shiva) మరియు విష్ణువులను (Lord Vishnu) ఆరాధించడం, దీపాలు (Diya) వెలిగించడం, వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది.
ఎలుకకు పూర్వజన్మ స్మృతి (క్లుప్తముగా)
వశిష్టుడు తన కథనాన్ని కొనసాగిస్తూ, కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలను వివరించారు. “ఓ జనకా! కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఎంతో పవిత్రమైన కార్యం. దీని వల్ల మనం ఎంతో పుణ్యం పొందుతాము. ఈ విషయానికి సంబంధించి ఒక అద్భుతమైన కథను చెబుతాను” అని ఆయన అన్నారు.
సరస్వతి నది (Saraswati River) ఒడ్డున ఒక శిథిలమైన దేవాలయం ఉండేది. ఒక యోగి ఆ దేవాలయంలో కార్తీక మాసం అంతా గడిపి, పురాణ (Purana) పఠనం చేస్తూ గడిపేవాడు. ఆయన ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి, దీపాలు వెలిగించి, పూజలు చేసేవాడు. ఒక రోజు ఒక ఎలుక (Rat) ఆ దేవాలయంలోకి వచ్చి, ఆరిపోయిన దీపం వత్తిని తన నోటితో తీసుకుని వెళ్ళింది. అదృష్టవశాత్తు, ఆ వత్తి పక్కనే ఉన్న వెలిగి ఉన్న దీపానికి తగిలింది. దీంతో ఆ ఎలుక నోటిలో ఉన్న వత్తి కూడా వెలిగింది. ఆ వత్తి వెలిగిన క్షణంలో ఆ ఎలుకకు తన పూర్వ జన్మ స్మృతి వచ్చింది. అది ఒక బ్రాహ్మణునిగా (Brahmin) జన్మించి, తన జీవితంలో ఎన్నో పాపాలు చేసిందని గుర్తు చేసుకుంది. ఆ దీపం వెలిగించడం వల్ల దాని పాపాలు తొలగిపోయాయి.
వశిష్టుడు ఈ కథను చెప్పి, “చూశావా జనక మహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో! ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కిన దీపంలో నూనె వేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ” అని వివరించాడు. “కార్తీక పురాణం” – 15వ అధ్యాయము (Karthika Puranam – Day 15) నందు ఈ క్రింది విధముగా …
Karthika Puranam – Day 15
దీప ప్రజ్వలనం – ఎలుకకు పూర్వజన్మ స్మృతి
తిరిగి జనక మహారాజుతో వశిష్టమహాముని ఇలా అంటున్నారు. “ఓ జనకా! కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తికాదు. కానీ, ఇంకో ఇతిహాసం చెబుతాను. శ్రద్ధగా వినుము” అని ఇలా చెప్పసాగెను.
“ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివ కేశవుల వద్ద దీపారాధన (Deeparadana) చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయంకాల సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయని వారు కాల సూత్రమనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణును (Sri Narayana) గంధ పుష్పాలతో, అక్షింతలతో పూజించి, ధూప, దీప నైవేద్యాలు సమర్పించినట్లయితే విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంత్యమున దేవ దుందుభులు మోగుతుండగా, వైకుంఠంలో విష్ణు సాన్నిధ్యం పొందగలరు.
ఇలా నెల రోజులు పూజాదికాలు నిర్వర్తించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవు నేతితో (Cow Ghee) దీపం వెలిగించాలి. ఆవు పాలు పితికినంత సేపు అయినా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపం నందు నూనె వేసినా, అవసాన దశలో ఉన్న దీపం యొక్క వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా, వారి సమస్త పాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను వినుము” అని ఇలా చెప్పసాగెను.
సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయము ఒకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసము అంతయూ అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్క గ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ, నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు.
ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ దీపం వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా, పక్కనే వెలుగుతున్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది.
ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. “ఓయీ! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా, అతను వినమ్రంగా “అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచి తీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగి పుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు.
అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ‘ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైన మతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ, ధనాశాపరుడవై వైదేవ పూజలు, నిత్య కర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగి ఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తిను బండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మినావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక, ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుకగా జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించి నందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు.
“చూశావా జనక మహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ” అని వివరించాడు.
ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: పంచ దశాధ్యాయ సమాప్త: పదహైదవ రోజు పారాయణం సమాప్తం.
“ఓం నమశ్శివాయ”
Also Read