వైశాఖ పురాణం – 19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 19వ అధ్యాయం ధర్మం యొక్క శక్తిని చాటిచెప్పే ఒక ఆశాజనకమైన కథ. ఒక ఋషి కుమారుడైన జలపాద దుష్ట రాక్షసుడిని సంహరించడం వల్ల ఋషి శాపంతో పిశాచిగా మారుతాడు. పిశాచి జీవితం చాలా బాధాకరంగా ఉంటుంది. ఒకరోజు సుధర్మ అనే ఋషిని కలుసుకున్న జలపాద తన కథ వివరిస్తాడు. సుధర్మ ఋషి జలపాదకు వైశాఖ వ్రతం ఆచరించమని సలహా ఇస్తాడు. 12 సంవత్సరాలు పాటు కఠిన నియమాలతో వ్రతాన్ని ఆచరించిన జలపాద, వ్రత ఫలితంగా శాపం నుండి విముక్తి పొంది మరలా మానవుడిగా మారుతాడు. తన కష్టానికి ఫలితం దక్కిన జలపాద సుధర్మ ఋషికి కృతజ్ఞతలు తెలిపి, తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేస్తాడు. చాలా మందికి ధర్మ మార్గంలో నడిచేలా ప్రేరణ ఇస్తాడు. ఈ అధ్యాయం ధర్మం ఎంతటి శక్తివంతమైనదో, ఎంతటి కష్టమైన పరిస్థితుల నుండి అయినా ధర్మం ద్వారా విముక్తి పొందవచ్చనే సందేశాన్ని మనకు అందిస్తుంది. వైశాఖ పురాణం – 19వ అధ్యాయం (Vaisakha Puranam – Day 19) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 19
వైశాఖ పురాణం – 19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
నారదుడు (Narada Muni) అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.
శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మ జన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి (Sri Hari) మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయును అనిన బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభ లాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.
వైశాఖమున సూర్యుడు మేషరాశి (Mesha Rasi) అందుడగా ప్రాతఃకాల స్నానమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యధా శక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.
పూర్వము గోదావరి (Godavari) తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.
వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో, తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణు కథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వాటిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు (Lord Vishnu) కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును, వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.
విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము, ధ్యానము, మననము, ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను (Ganga River) విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము, విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణ మృగము గాని, విష్ణు కథగాని, సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణు కథా శ్రవణము ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.
ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన యిష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థ స్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి అందువారును స్నానాది కర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము (Harikatha), చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.
ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు యెండిన పెదవులు, నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.
ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని సిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతము అంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నాను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వాని పాదములపై బడి దుఃఖించెను.
సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను. ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు-సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.
శ్రుతకీర్త మహారాజా! కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు యిహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు యిహము, పరము, నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.
ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |
తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||
ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |
కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||
ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |
బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||
అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.
వైశాఖ పురాణం 19 వ అధ్యాయం సమాప్తం.
Read more Puranas: