వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 15

వైశాఖ పురాణం – 15వ అధ్యాయం – వైశాఖ వ్రత మహిమ

Vaisakha Puranam - Day 15

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 15వ అధ్యాయం వైశాఖ మాసంలో ఆచరించే “వైశాఖ వ్రతం” యొక్క విశిష్టతను వివరిస్తుంది. నారదుడి ప్రశ్నకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు, వైశాఖ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలను వివరిస్తాడు. ఈ వ్రతం ద్వారా శ్రీ మహావిష్ణువు (Lord Vishnu) అనుగ్రహం లభించడమే కాకుండా పాపాలు నశించి, పుణ్యం ప్రాప్తిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అకాల మరణం లేకుండా దీర్ఘాయుష్యం లభిస్తుంది, దేవతల ఆశీర్వాదాలు వారిని వరిస్తాయి. వైశాఖ పున్నమి నుండి ప్రారంభమయ్యే ఈ వ్రతంలో 9 రోజుల పాటు ఉపవాసం ఉండి, శ్రీ మహావిష్ణువును పూజించాలి. చివరి రోజు పారణ చేసి వ్రతాన్ని పూర్తి చేస్తారు. వైశాఖ వ్రతం యొక్క పుణ్య మహిమను కొన్ని కథల ద్వారా వివరించిన ఈ అధ్యాయం, వైష్ణవులు తమ జీవితాల్లో శుభ ఫలితాలు పొందాలని కోరుకునే వారికి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందాలని ఆశించే వారికి మార్గదర్శకంగా ఉంటుంది.  వైశాఖ పురాణం – 15 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 15) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 15

వైశాఖ పురాణం – 15వ అధ్యాయం – వైశాఖ వ్రత మహిమ

నారదమహర్షి (Narada Muni) అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్య ప్రదములు విష్ణు ప్రీతికరములు ధర్మాధి ధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు వేద (Veda) నిరూపితములు కదా ఇట్టి ఉత్తమ ధర్మములు లోకమున ఎందుకని  ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్ట సాధ్యములు అధిక ధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘ మాసమును (Magha Masam) మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరి కొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింప గోరుచున్నానని అడిగెను. 

శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో ఇతర ధర్మములకు ఎందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహిక భోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామస గుణప్రధానులు. ఇంత మందిలో ఎవడో ఒకడు ఎదో ఒక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర (Kshudra) ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు (Vishnu) ప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామ కర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.

వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో (Ikshvaku Dynasty) ఉత్తముడు. కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొక నాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి (Vasishtha) ఆశ్రమ ప్రాంతమును చేరెను.

అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను,  మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసన కఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్ల నీడల యందు, ఇంటి ముంగిళ్లయందు మండపముల యందు ఇసుకను పరచి కూర్చుండుటకు వీలుగ చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రము అగు వశిష్టుని ఆశ్రమమునకు వెళ్లెను.

అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు  ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయ ఉంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.

వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు.వైశాఖమాసమున (Vaisakha Masam)బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము.

వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి (Sri Hari) సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్ప కర్మకైనను  సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్ప కర్మకైనను  అధిక ఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా!

వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశ ప్రజల చేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖ ధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాస వ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి (Maharshi) నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.

ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు ఎనవై సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాస వ్రత ధర్మమును ఆచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహిస్కరింతునని చాటించెను. వైశాఖ వ్రతమును ఆచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మ బంధువైనను తీవ్ర దండన కర్హులేయనియు ప్రకటించెను.

వైశాఖమున ప్రాతఃకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధా శక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును ఇహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.

ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు (నరకమునకు – Hell) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి (Chitragupta)జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును  శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము (Heaven) వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.

 వైశాఖ పురాణం 15వ అధ్యాయం సమాప్తం.

Read more Puranas:

Leave a Comment