వైశాఖ పురాణం |Vaisakha Puranam – Day 14

వైశాఖ పురాణం – 14వ అధ్యాయం – ఛత్ర దాన మహిమ

Vaisakha Puranam - Day 14

వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క 14వ అధ్యాయం లోకానికి ఎండ, వానల నుండి రక్షణ కల్పించే ఛత్ర దానం మహిమను వివరిస్తుంది. నారదుడి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు (Lord Vishnu), ఛత్ర దానం వల్ల కేవలం భౌతిక రక్షణే కాకుండా, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని వివరిస్తాడు. సూర్యుని కిరణాల నుండి కాపాడటమే కాకుండా, ఛత్రం దానం చేసిన వ్యక్తి పాపాల నుండి విముక్తి పొంది, పుణ్యాన్ని ఆర్జిస్తుంది. అంతేకాకుండా, అష్టైశ్వర్యాలు – ధనం, ఆరోగ్యం, సంతానం, సౌఖ్యం, ఐశ్వర్యం, కీర్తి, విజయం, జ్ఞానం – సిద్ధించే అవకాశం కూడా ఉంటుంది. ఛత్ర దానం చేసిన వారికి అకాల మరణం లేకుండా దీర్ఘాయుష్యం లభిస్తుంది.

దేవతలు కూడా ఛత్ర దానం చేసిన వారిని ఆశీర్వదిస్తారు, వారి కార్యాలు సఫలీకృతమవుతాయి అని విష్ణుమూర్తి తెలియజేస్తాడు. అంతేకాకుండా, ఎవరు ఛత్ర దానం చేయడానికి అర్హులు, ఎప్పుడు దానం చేయాలి, ఎలాంటి ఛత్రం ఇవ్వాలి వంటి వివరాలను కూడా వివరిస్తాడు. చివరగా, కొన్ని కథల ద్వారా ఛత్ర దానం చేసిన వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో వివరించి, ఛత్ర దానం యొక్క పుణ్య మహిమను స్పష్టం చేస్తాడు. వైశాఖ పురాణం – 14వ అధ్యాయం (Vaisakha Puranam – Day 14) నందు ఈ క్రింది విధముగా . . .

Vaisakha Puranam – Day 14

వైశాఖ పురాణం – 14వ అధ్యాయం – ఛత్ర దాన మహిమ

శ్రుత దేవమహాముని యిట్లు పలికెను. వైశాఖమాసమున (Vaisakha Masam) ఎండకు బాధపడు సామాన్యులకు, మహాత్ములకు ఎండ వలని బాధ కలుగకుండుటకై గొడుగుల నిచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించు కథను వినుము.

పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖమాస వ్రతమును వివరించు కథ యిది వంగ దేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు నతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహములు (Varaha) మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చినులను మునులయాశ్రమము. ఆ విషయము ఎరుగని రాజ కుమారుడు వారిని పలు విధములుగ పలుకరించినను వారు సమాధానము ఈయక పోవుటచే వారిని చంపపోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడా మునుల శిష్యులు అనేకులచటకు వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధీ! మా గురువులు తపోదీక్షలోనున్నారు. వారికి బాహ్యస్మృతి లేదు. కావున వారు నిన్ను చూడలేదు. గౌరవింపలేదు. ఇట్టివారిపై కోపము కూడదని వారు పలికిరి.

అప్పుడు కుశకేతుని కుమారుడు అగు హేమ కాంతుడు వారిని చూచి మీ గురువులు తపో దీక్షలో నున్నచో మీరు అలసిన నాకు ఆతిధ్యమునిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు రాజకుమారా! మేము భిక్షాన్నమును తినువారము మీకు ఆతిధ్య ము ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞలేదు. ఇట్టి మేము నీకు ఆతిధ్యము నీయజాలము అని చెప్పిరి. హేమకాంతుడు ప్రభువులమగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్ము రక్షించు ప్రభువులము. మేమిచ్చిన అగ్రహారములు మున్నగువానిని పొందియు మీరు మా ఎడల నీ విధముగ ఉండరాదు. కృతఘ్నులైన మిమ్ము చంపినను తప్పులేదు. అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమములోని వస్తువులను కొల్లగొట్టిరి. ఆశ్రమమును పాడు చేసిరి.

పిమ్మట హేమాంగదుడు (Hemangada) తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజుగనుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగ నిరువదియెనిమిది సంవత్సరములు గడచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటు పడి కిరాత ధర్మముల నాచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మ హత్యాదోషమున నిలకడ లేక అడవుల బుట్టి తిరుగుచు జీవించుచుండెను.

వైశాఖమాసమున త్రితుడను ముని ఆ యడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు నొకచోట మూర్ఛిల్లెను. దైవికముగ అడవిలోనే యున్న హేమకాంతుడు వానిని జూచి జాలిపడెను. మోదుగ ఆకులనుదెచ్చి ఎండపడకుండ గొడుగుగ చేసెను. తన వద్ద సొరకాయ బుఱ్ఱలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడును వాని చేసిన ఉపకారములచే సేదదీరి సొరకాయ బుఱ్ఱలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమును చేరి సుఖముగ నుండెను. హేమాంగదుడు వ్రతమును ఆచరింపక పోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని యిచ్చుటచే వానికి గల పాపములన్నియు పోయెను. దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంత కాలమునకతడు రోగగ్రస్తుడై యుండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములగొనిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని జూచి భయపడెను. వైశాఖమున మోదుగ (Moduga Chettu) ఆకుల గొడుగును, సొరకాయ బుఱ్ఱ నీటిని యిచ్చిన పుణ్యబలమున వానికి శ్రీమహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను.

దయాశాలి అగు శ్రీమహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము. వైశాఖమాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము. హేమాంగదుడు వైశాఖధర్మము నాచరించి నాకిష్టమైన వాడయ్యెను. పాపహీనుడయ్యెను. ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు. మోదుగాకుల గొడుగును (Umbrella) నీటిని యిచ్చినవాడు. ఆ దాన ప్రభావమున నితడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి. శౌర్యాదిగుణ సంపన్నుడు. నీకు సాటియైన వాడు. కావున వీనిని రాజుగ చేయుమని నా మాటగ చెప్పుమని శ్రీమహావిష్ణువు విష్వక్సేనుని (Vishvaksena) హేమాంగదుని వద్దకు పంపెను.

భగవంతుని యాజ్ఞ ప్రకారము విష్వక్సేనుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలకు విష్ణువు మాటలను చెప్పి పంపెను. హేమాంగదుని తండ్రియగు కుశకేతువు వద్దకు కోనిపోయి శ్రీమహావిష్ణువు (Sri Hari) చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడ సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాజ్యమును ఇచ్చి విష్వక్సేనుని అనుమతితో భార్యతో బాటు వనముల కేగి తపము ఆచరింపబోయెను. విష్వక్సేనుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణుసాన్నిధ్యమున కెరిగెను.

హేమకాంతుడును మహా రాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యెను. హేమాంగదుడు బ్రహ్మ జ్ఞానియై ధర్మ మార్గము నవలంభించి, శాంతుడు, దాంతుడు, జితేంద్రియుడు, దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వసంపదలను పొంది, పుత్ర పౌత్రులతో కూడినవాడి సర్వభోగముల ననుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శ్రుతకీర్తి మహారాజా! వైశాఖ ధర్మములు సాటిలేనివి. సులభసాధ్యములు పుణ్య ప్రదములు. పాపమును దహించునని ధర్మార్థ కామమోక్షములను కలిగించునవి. ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్య ఫలమునిచ్చునని శ్రుతదేవుడు వివరించెను, అని నారదుడు (Narada Muni) అంబరీషునకు చెప్పెను.

 వైశాఖ పురాణం 14వ అధ్యాయం సమాప్తం.

Read more Puranas:

Leave a Comment