వైశాఖ పురాణం – 9 వ అధ్యాయం – సతీ దేహ త్యాగము
వైశాఖ పురాణం (Vaisakha Puranam) యొక్క తొమ్మిదవ అధ్యాయంలో సతీ దేవత యజ్ఞానికి ఆహ్వానించబడకపోవడం, తన తండ్రి దక్షుడి గురించి తన భర్త శివుడి ద్వారా తెలుసుకోవడం, తండ్రి యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానించబడటం, తన భర్త పట్ల ఉన్న భక్తితో యజ్ఞ వేదికలోనే తన ప్రాణాలను కోల్పోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి.
సతీ దేవత యజ్ఞానికి వెళ్ళినప్పుడు, ఆమెను ఎవరూ పలకరించలేదు. దక్షుడు రుద్రుడికి హవిస్సు ఇవ్వకపోవడం గురించి ఆమె తన తండ్రిని ప్రశ్నించింది. సతీ దేవత మాటలకు కోపించిన దక్షుడు ఆమెను, శివుడిని బహువిధముల నిందించాడు. ఈ దుర్భాషలను సహించలేక సతీ దేవత యజ్ఞ వేదికలోనే తన ప్రాణాలను కోల్పోయింది.
ఈ కథ భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగం, అంకితభావానికి కూడా చక్కటి ఉదాహరణ. సతీ దేవత తన భర్త పట్ల ఉన్న భక్తితో తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కథ మనకు మన తల్లిదండ్రులను గౌరవించడం, వారి మాటలను పాటించడం ఎంత ముఖ్యమో కూడా గుర్తు చేస్తుంది. వైశాఖ పురాణం – 9 వ అధ్యాయం (Vaisakha Puranam – Day 9) నందు ఈ క్రింది విధముగా . . .
Vaisakha Puranam – Day 9
వైశాఖ పురాణం – 9 వ అధ్యాయం – సతీ దేహ త్యాగము
అంబరీష మహారాజుతో నారదుడిట్లు (Narada Muni) పలికెను. శ్రుత దేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! ఇక్ష్వాకు వంశ రాజు (Ikshvaku Dynasty) అగు హేమాంగదుడు జల దానము చేయకపోవుట వలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా ! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మొదలగు జన్మలను ఎత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను (Eagle), పలు మార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా.
కావున వీనికి శునకాది జన్మలు ఎందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున (Mount Kailash) చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని ఇహ లోక సంబందము, పర లోక సంబందము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహ లోక సంబందములుగ జల సేవ, అన్నసేవ, ఔషధ సేవయని ఇహలోక స్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును ఇహ లోక స్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖ స్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గ సేవయను మూడును ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది.
ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగ పడినట్లుగ ఇహ లోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకొన్న సాధు, విష్ణు (Lord Vishnu), ధర్మమార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఎదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతి వృత్తమును వినుము. పార్వతీ (Parvati Devi) ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును, ఆనందమును కలిగించును.
పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తె అగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని (Lord Siva) యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి “నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను, చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవక ప్రాయులు, ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లను ఇచ్చిన మామయై గౌరవార్హుడైనను, పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని చూసి లేవరాదు అని పండితుల మాటకదా! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే.
కాని ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవ దేవుడునగు తాను (శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ, భార్యను జూచి భర్త లేచినట్లుగ, సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మ విరుద్దముగ నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించును అని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్ష ప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను, దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు.
కాని పరమేశ్వరుడు అంతటి వాని ఆలోచనాశక్తిని, ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్షమును గమనింప లేక అల్లుడు తనను గౌరవింప లేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను. ఓహో! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా ! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా ! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును, ఎముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టి వాడిచ్చు మంగళమేమియుండును? లోకములు, శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు.
దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజ (Elephant) చర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది ఇతని యైశ్వర్యము. ఇట్టి ఈతడీశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. ‘శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయును అను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్ప గావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక.
ఇట్టి ఇతడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వాని వద్దనున్న పవిత్ర కలశము విడువ దగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు” అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తె అగు సతీదేవిని, అల్లుడు అగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలి పోయెను.
యజ్ఞ వాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. బ్రహ్మ (Brahma), విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి.
పుణ్యాత్మురాలు అగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము అనుసరించి యజ్ఞమునకు వెళ్ల తలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రి అగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింప రాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మము అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనము అగు నంది వృషభ రూపమున వచ్చి ఆమె ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీ దేవియు యజ్ఞశాలకు (Yagna Shala) వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.
యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతి దేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక వద్దకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను చూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతుల నిచ్చెను.
తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రీ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు (Rudra) లోకకర్త – లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశ రహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా? ఇట్టి దుర్బర బుద్దినిచటివారు కలిగించారా? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి? విధివిధానము వీరికి విముఖమైయున్నదా? అని సతీదేవి పలికెను.
సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి (Bhrigu Maharishi) సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను, తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోని వారు దక్షుని (Daksha) సమర్థించుచు, సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను, శివుని బహువిధముల నిందించెను.
రుద్రాణి యగు సతీదేవి (Sita Devi) దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞ వేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరుకి ఆ విషయమును తెలిపిరి.
వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంపూర్ణం.
Read more Puranas: