Mahashivratri Vrat

పురాణ కాలం నుండే మహా శివరాత్రిని వ్రతంగా (Mahashivratri Vrat) పాటించే సంప్రదాయం ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించేవారికి శివుడి (Lord Shiva) అనుగ్రహం, ముక్తి లభిస్తాయి. నెలవారీ శివరాత్రులతో సహా, మహా శివరాత్రి నాడు నియమాలు పాటిస్తే పుణ్య ఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సిద్ధిస్తాయని శివే చెప్పాడు. శివరాత్రి వ్రతం అన్ని వర్ణాల వారికీ, స్త్రీ పురుషులందరికీ ఉత్తమమైనది. మాఘమాసం కృష్ణ పక్షంలో (Krishna Paksha) రాత్రంతా ఉపవాసం ఉండి, శివపూజ చేయాలి. పూజా విధానాలు, పండుగ రోజు ఆచరణ గురించి శివుడు వివరించాడు. ఈ వ్రతం చేస్తే శివుడు భక్తులను ఆశీర్వదిస్తాడు.
మహా శివరాత్రి పర్వ దినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడు ఉంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రి నాడే కాకుండా ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి, ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్య ఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే.
ఓసారి బ్రహ్మ (Brahma), విష్ణువు (Lord Vishnu), పార్వతీ (Parvati) నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని, ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు వృతం చేసిన వారికే కాక చూసిన వారికీ, విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి మరియు దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని, ముక్తిని మానవులకు కలిగించే శివ సంబందిత వ్రతాలు మిక్కిలి ఉన్నాయి.
జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్ర జపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో (Varanasi) మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్ధశి (Chaturdashi) శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది. ధర్మ సాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వ వర్ణాలవారు, అన్ని ఆశ్రమాలవారు, స్త్రీలు, పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.
మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివ పూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం (Shiva Lingam) ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల, బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు.
భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రత మాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతనూ చెయ్యాల్సి ఉంటుంది. వ్రత ఆనంతరం యధా శక్తిగా పండితులకు, శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృత అభిషేకం, ఆ తర్వాత జల ధారతో అభిషేకం నిర్వహించాలి.
చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు, పద్మంలాంటి పుష్పాలతో అర్చించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు (Rudra), పశుపతి (Pashupati), ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. తదనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలి జాము పూజ ముగుస్తుంది.
రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు, యవలు, కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.
మూడో జాములో చేసే పూజలో యవల స్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.
నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను, శంఖ పుష్పాలకు, మారేడు దళాలను (Bilva Patra) వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను, మినుములతో కలిపి వండిన అన్నమును కానీ పెట్టాలి. అరటి పండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాలి. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతూ ఉండాలి.
నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి (Mantra Pushpanjali) సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రత క్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు, సుఖాలు కలిగిస్తానని శివుడు ఈ కథను బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు.
Also Read
Read Latest Post
- Tripura Sundari Pancharatna Stotram | త్రిపురసుందరీ పంచరత్న స్తోత్రం
- Arjuna Kruta Durga Stotram – అర్జున కృత శ్రీ దుర్గా స్తోత్రం
- Maha Mrityunjaya Stotram – మహా మృత్యుంజయ స్తోత్రం
- Nirvana Shatkam | నిర్వాణషట్కం
- Shiva Panchakshari Stotram | శివ పంచాక్షరి స్తోత్రం
- Kasi Vishwanathashtakam | కాశీ విశ్వనాథాష్టకం